Indore Crime News: ఇంటి బాధ్యతలను చూసుకునే కోడలే.. అత్తింటి నగలు, డబ్బుపై కన్నేసింది.. తన సోదరుడితో ప్లాన్ రచించి.. అత్తింటి మొత్తాన్ని దోచుకుంది. బంగారు ఆభరణాలు, నగదు కలిపి కోటి రూపాయల వరకు దోచుకుంది. ఈ షాకింగ్ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. అక్టోబరు 13న జరిగిన ఈ ఘటన అనతంరం పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణలో పోలీసులకు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంటి కోడలే ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గృహోపకరణాల దుకాణాన్ని నడిపిస్తున్న అగర్వాల్ కుటుంబంతో ఇండోర్‌లో నివసిస్తున్నాడు. అయితే.. తన తండ్రితో కలిసి రోహిత్ అగర్వాల్ దుకాణాన్ని చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో రోహిత్ భార్య ఇంట్లో ఉన్న నగదు, డబ్బుపై కన్నేసింది.
ఈ క్రమంలో 13న ఈ ఘటన జరిగిన సమయంలో రోహిత్.. తన తండ్రి, సోదరుడితో కలిసి షాపునకు వెళ్లాడు. రోహిత్ తల్లి, అతని భార్య మాధురి, తమ్ముడి భార్య, వారి పిల్లలు ఇంట్లో ఉన్నారు. సాయంత్రం సమయంలో రోహిత్ తల్లి అస్వస్థతకు గురి కాగా.. మాధురి, ఇంట్లో ఉన్న కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. తిరిగొచ్చి చూసేసరికి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పడేసి ఉన్నాయి. దొంగతనం జరిగినట్లు భావించిన అగర్వాల్ కుటుంబం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు చివరకు ఇంటి కోడలు మాధురే చోరీకి పాల్పడినట్లు తేల్చారు. తన సోదరుడు వైభవ్‌తో కలిసి.. దొంగతనానికి ప్లాన్ రచించిందని చెప్పారు.
బంగారం, డబ్బును దొంగతనం చేయాలన్న ఉద్దేశంతో తన అత్తను ఆస్పత్రికి తీసుకెళ్లే ముందు ఇంటి తలుపులను మాధురి తెరిచి ఉంచినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం వైభవ్ అతడి స్నేహితుడు అర్బాజ్ ఇంట్లో ఉన్న నగదు, ఆభరణాలను దోచుకెళ్లారని పోలీసులు పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి రూ.85 లక్షల విలువైన బంగారు ఆభరణాలను, డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Also Read: