హైదరాబాద్ డ్రగ్స్ వాడకానికి కేంద్ర బిందువుగా తయారవుతోందని రిటైర్డ్ ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… డ్రగ్స్ మాఫియా పకడ్బందీగా హైదరాబాద్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తోందని ఆరోపించారు. హై ప్రొఫైల్ ఉండే వ్యక్తులే డ్రగ్స్ కు ఎక్కువగా బానిసలు అవుతున్నారని వివరించారు. అయితే, 30 వరకు హై ప్రొఫైల్ గ్యాంగ్‌లు హైదరాబాద్లో డ్రగ్స్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని స్పష్టం చేశారు. డ్రగ్స్ మాఫియాకు క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తుల నుంచి సపోర్డ్ లభిస్తోందని, వారి అండదండలు చూసే డ్రగ్స్ మాఫియా నగరంలో రెచ్చిపోతోందని అన్నారు. డ్రగ్ వినియోగదారులను కాకుండా అమ్మేవారిపై నిఘా పెడితే డ్రగ్ మాఫియాను అరికట్టవచ్చని సూచించారు.
రానున్న నూతన సంవత్సర వేడుకలను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ మాఫియా ఇప్పటికే సిటీలో పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను డంప్ చేశారని అన్నారు. నగరంలో పార్టీలు జరిగే ప్రాంతాలను ఎంచుకొని డ్రగ్స్ మాఫియా ఇప్పటికే డ్రగ్స్‌ను అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. న్యూ ఇయర్ భారీ డిస్కౌంట్ అంటు సోషల్ మీడియా వేదికగా డ్రగ్ విక్రయాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేస్తేనే మాదక ద్రవ్యాల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు. డ్రగ్స్ వ్యవహారానికి చెక్ పెట్టాలంటే కఠినమైన యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్ళాలని సూచించారు.