Hetero official Arrest: దేశంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాదిమంది వైరస్ బారిన పడుతుండగా.. వేలాది మరణిస్తున్నారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చేరే రోగుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో కరోనా రోగులకు అత్యవసర పరిస్థితుల్లో ఇచ్చే రేమెడిసివర్ ఇంజెక్షన్లు ఎక్కడా లభ్యంకావడం లేదు. ఇదే ఆసరాగా భావిచి కొంతమంది రోగుల నుంచి దోచుకుంటున్నారు. రూ.3వేల రెమిడెసివిర్ ఇంజక్షన్‌ను బ్లాక్ మార్కెట్‌లో 35 వేల నుంచి 50వేల వరకు విక్రయిస్తున్నారు. అలాంటి కేటుగాళ్ల గుట్టును నల్లగొండ జిల్లా పోలీసులు ఛేదించారు. మిర్యాలగూడలోని శ్రీ సూర్యా ఆసుపత్రి అడ్డాగా సాగుతున్న వ్యాపారానికి బ్రేక్ వేశారు. దీనికి సంబంధించిన వివరాలను సోమవారం డీఐజీ రంగనాధ్ తెలియజేశారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని శ్రీ సూర్యా ఆసుపత్రిపై పోలీసులు రెండు రోజుల క్రితం దాడులు చేసి భారీ సంఖ్యలో రేమిడిసివర్ ఇంజెక్షన్లను సీజ్ చేశారు. ఈ క్రమంలో పకడ్భంధీగా విచారణ నిర్వహించగా అసలు రెమిడెసివిర్ తయారు చేసే కంపెనీ మేనేజరే సుత్రధారి అని తేలింది. మిర్యాలగూడకు చెందిన బాలకృష్ణ హైదరాబాద్ హెటిరో కంపెనీలో మేనేజర్ గా పని చేస్తున్నాడు. అయితే అతని స్నేహితుడు మిర్యాలగూడ పరిధిలోని శాఖపాలెంకు చెందిన గణపతి రెడ్డి క్యూ ల్యాబ్ పేరుతో హైదరాబాద్ లో వ్యాపారం నిర్వహిస్తున్నాడు. హెటిరో కంపెనీ మేనేజర్ గా పని చేస్తున్న బాలకృష్ణ.. హైదరాబాద్, ఉప్పల్ ప్రాంతానికి చెందిన శ్రీ లక్ష్మీ ఏజెన్సిస్ కు 3,000 రూపాయలకు ఒక బాటిల్ చొప్పున సరఫరా చేస్తున్నాడు. అక్కడి నుంచి అతని స్నేహితుడు బాలకృష్ణ ఒక్కో బాటిల్ కు 8,000కు కొనుగోలు చేసి వాటిని మిర్యాలగూడ పట్టణానికి చెందిన శ్రీ సూర్యా ఆసుపత్రి డాక్టర్ అశోక్ కుమార్‌కు ఒక్కో బాటిల్ రూ. 23,000 వేలకు గణపతి రెడ్డి నుంచి కొనుగోలు చేసేవాడు.
వీటిని శ్రీ సూర్యా ఆసుపత్రి పిఆర్వోగా ఉన్న శ్రీనివాస్ వీటిని హైదరాబాద్ నుంచి తీసుకువచ్చి.. కరోనా చికిత్స కోసం జాయిన్ అయ్యే వారికి ఒక్కో బాటిల్ రూ. 35,000 నుంచి 50,000 వరకు విక్రయించారని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 138 బాటిల్స్ శ్రీ సూర్యా ఆసుపత్రికి గణపతి రెడ్డి ద్వారా సరఫరా జరిగిందని రంగనాధ్ వివరించారు. ఈ కేసులో రెండు రోజుల క్రితం శ్రీ సూర్యా ఆసుపత్రి డాక్టర్ అశోక్ కుమార్ తో పాటు.. మరో ముగ్గురిని అరెస్ట్ చేశామని.. సోమవారం హెటిరో మేనేజర్ బాలకృష్ణ, అతని స్నేహితుడు గణపతి రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని తెలిపారు.
Also Read: