తాళికట్టిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. అతికిరాతకంగా భార్యను గొంతుకోసి హతమార్చాడు. జీవితాంతం కలిసి ఉంటానని ప్రమాణం చేసిన భర్తే కుటుంబ కలహాల కారణంగా భార్యను అంతమొందించాడు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ మండలం కాసింపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు…
కాసింపూర్ గ్రామానికి చెందిన శంకర్, పుణ్యవతి దంపతులు గత కొద్ది రోజులుగా కుటుంబ కలహాల కారణంగా దూరంగా ఉంటున్నారు. గత ఎనిమిది నెలలుగా భార్య పుణ్యవతి పుట్టింట్లోనే ఉంటోంది. అయితే, పెద్దలు రాజీ కుదర్చడంతో ఐదు రోజులక్రితమే ఆమె తన భర్త వద్దకు వచ్చింది. అయితే, పొలం పనులకు వెళ్లి చీకటి పడ్డాక ఇంటికి తిరిగి వస్తుండగా, భార్యాభర్తల మధ్య గొడవ మొదలైందని, మాట మాట పెరగటంతో కోపోద్రిక్తుడై శంకర్ చేతిలో ఉన్న కత్తితో భార్య గొంతుకోసి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని జహీరాబాద్ సి ఐ సైదేశ్వర్, చిరాగ్పల్లి ఎస్ఐ గణేష్ సందర్శించి మృతదేహాన్ని జహీరాబాద్ వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రికి తరలించారు. హత్యకు పాల్పడ్డ మృతురాలి భర్త శంకర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.