Big Robbery: ప్రస్తుత కాలంలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి ఉంది. పాపం అని చేరదీస్తే జీవితంలో కోలుకుండా చేస్తున్నారు కొందరు మోసగాళ్లు. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.
హైదరాబాద్‌లో వరుస చోరీలకు పాల్పడుతున్న నేపాలీ దంపతులను శనివారం నాడు సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
హైదరాబాద్‌లో జరిగిన భారీ చోరీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నేపాల్‌కు చెందిన ఓ జంట ఐదు నెలల క్రితం రాయదుర్గం పరిధిలోని టెలీకాం నగర్‌లో ఓ ఇంట్లో పనికి చేరారు. ఇన్ని రోజులు చాలా నమ్మకంగా పనిచేస్తూ వచ్చారు.
ఈ నెల 19వ తేదీన ఇంటి యజమాని శ్రీశైలం వెళ్లారు. అదే అదునుగా భావించిన నేపాలీ జంట.. ఇంటిని గుల్ల చేశారు. అందినకాడికి దోచుకున్నారు. ఇంట్లో ఉన్న కిలో బంగారం, పది లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు.
అయితే, శ్రీశైలం నుంచి ఇంటికి చేరుకున్న యజమానులు.. ఇంట్లో దోపిడీ జరిగిన విషయాన్ని నిర్ధారించుకున్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంటి ఆవరణలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. దోపిడీకి పాల్పడింది ఇంట్లో పనికి చేరిన నేపాలీ దంపతులే అని తేల్చారు. తాజాగా వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తలరించారు.