gun misfire in vijayawada : ఆయుధాలతో జాగ్రత్తగా ఉండాలని పలు సంఘటనలు నిరూపిస్తున్నా ఎవ్వరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. అప్రమత్తంగా లేకపోవడం వల్ల అనవసరంగా ప్రాణాలు కోల్పోతున్నారు. భద్రపరిచే దగ్గర, నిర్లక్ష్యంగా పట్టుకోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఏపీలోని విజయవాడ, గొల్లపూడిలో తుపాకి మిస్ ఫైర్ అయి ఓ హోంగార్డు భార్య మృతి చెందింది. ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి..
ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం అదనపు ఎస్పీ వద్ద హోంగార్డు వినోద్‌కుమార్ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. అనుకోకుండా ఎస్పీ ఇంటి నుంచి అతడు తుపాకీని తన నివాసానికి తీసుకొచ్చారు. కూరగాయలతో పాటు పొరపాటున హోంగార్డు తుపాకీ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం తుపాకీని బీరువాలో పెట్టమని భార్యకు చెప్పాడు. ఈ క్రమంలో ఏం జరిగిందో తెలియదు తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో హోంగార్డు భార్య సూర్యరత్న ప్రభ అక్కడికక్కడే మృతిచెందారు. గొల్లపూడి మౌలానగర్‌లో హోంగార్డు కుటుంబం నివాసం ఉంటోంది. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేశారు. కాగా తుపాకి శబ్ధం కావడంతో చుట్టు పక్కల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. హోంగార్డు వినోద్‌కుమార్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది.
పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. చాలామంది కానిస్టేబుళ్లు మిస్ ఫైర్ వల్ల ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఉద్యోగంలో చేరేముందు ఆయుధాల నిర్వహణలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినా నిర్లక్ష్యం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఆయుధాలు దగ్గర ఉండటం వల్ల కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఇప్పటికైనా పోలీసు సిబ్బంది ఆయుధాల నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలిన ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.