Gold Seized at RGI airport: బంగారం, వెండి స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు భారత కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ.. అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. సినీ ఫక్కీలో స్మగ్లర్లు రోజుకో కొత్త దారిలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ పోలీసులకు చిక్కుతున్నారు. ప్రాణానికి ప్రమాదమని తెలిసినా స్మగ్లర్లు.. శరీర భాగాల్లో బంగారాన్ని ఉంచుకుని భారతదేశానికి వస్తున్నారు. తాజాగా మణిపూర్‌లోని ఇంఫాల్‌లో ఓ ప్రయాణికుడి మల ద్వారంలో బంగారాన్ని తరలిస్తూ పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఏయిర్‌పోర్టులో బంగారం, వెండిని అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన కూడా కస్టమ్స్ అధికారులకు షాకిచ్చింది.
బంగారం, వెండిని ఫేస్‌క్రీమ్‌గా మార్చి అక్రమంగా తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో శనివారం తనిఖీలు నిర్వహించగా.. నయా స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దోహా నుంచి హైదరాబాద్‌కు 6ఈ 1714 విమానంలో వచ్చిన ఒక ప్రయాణికుడి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకొని.. అతనితోపాటు తెచ్చిన సామగ్రిని తనిఖీచేశారు. ఈ క్రమంలో బ్యాగులో ఫేస్ క్రీమ్ రూపంలో దాచిన 528.02 గ్రాముల బంగారం, 28 గ్రాముల వెండి లభించినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. వీటి విలువ రూ. 20.44 లక్షలు ఉంటుందని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని కస్టమ్స్ అధికారులు తెలిపారు. అనుమతి లేకుండా అక్రమంగా బంగారం, వెండి తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Also Read: