
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. చిలికలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని వారాసిగూడలో ఓ మైనర్ బాలికను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. తొలుత ప్రమాద వశాత్తు బిల్డింగ్ పై నుంచి పడిపోవడంతో చనిపోయిందనుకున్నారు. కానీ బిల్డింగ్‌పై వెళ్లి చూడగా.. అక్కడ రక్తపు మరకలు ఉండటంతో.. హత్యాగా భావించారు. అయితే రాత్రి చదువుకునేందుకని బిల్డింగ్‌పైకి వెళ్లిన బాలిక.. తెల్లవారుజామున ఇలా శవమై కనిపించడంతో.. తల్లిదండ్రులు బోరునవిలపిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు… క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యులను విచారించగా.. షోయబ్ అనే యువకుడిపై అనుమానాల్ని వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా తమ కూతుర్ని ఇచ్చి పెళ్లి చెయ్యాలంటూ వేధించేవాడని.. అయితే తాము తిరస్కరించామన్నారు. ఈ నేపథ్యంలో తమ కూతురిపై కక్షపెంచుకుని.. ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చేపడుతున్నారు.