సూర్యాపేట: సోషల్ మీడియాలో పరిచయమైన ప్రియుడి కోసం ఓ యువతి తన సొంత ఇంటికే కన్నం వేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఇక అసలు వివరాల్లోకి వెళ్తే సుమారు రెండు నెలల క్రితం తాళ్లగడలోని ఓ ఇంట్లో 20 తులాల బంగారం చోరీకి గురైనట్లు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాధితుడి మనవరాలే ఆ నగదు దొంగలించి యానాంలో ఉన్న తన ప్రియుడికి చేరవేసిన విషయం బయటపడింది.
తాళ్లగడ్డలో నివాసం ఉంటున్న తాతా అమ్మమ్మల వద్ద ఉంటూ ఆ యువతి స్థానిక ఫార్మాసిటికల్ కాలేజీలో ఎం-ఫార్మసీ చదువుతోంది. ఈ క్రమంలోనే ఆమెకు సోషల్ మీడియా ద్వారా 8 నెలల క్రితం యానాంకు చెందిన కర్రి సతీష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడగా.. కొంతకాలానికి అది కాస్తా ప్రేమగా మారింది. జల్సాలకు బాగా అలవాటు పడ్డ సతీష్ మాయమాటలతో సదరు యువతిని నమ్మించి అవసరాల కోసం డబ్బులు అడిగేవాడు. ఆమె ఆ మాయగాడి మాటలు నమ్మి.. తాత ఇంటి బీరువాలో దాచిన సుమారు 20తులాల బంగారు అభరణాలు చోరీ చేసింది. ఇక అది ఎవరికి తెలియకుండా ప్రియుడికి చేరవేసింది. ఈ విషయం తెలియని తాత ఇంట్లో నగదు చోరీకి గురైనట్లు భావించి ఏప్రిల్ 14న పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దానితో పోలీసులు రంగంలోకి దిగి.. అనుమానితులతో పాటు ఇంటివారిపై కూడా నిఘా పెట్టారు. అందులో భాగంగా ఫిర్యాదుదారుని మనవరాలే దొంగిలించి.. ఆ సొమ్మును యానాంలోని ఆమె ప్రియుడికి అందించినట్లు పోలీసులు నిర్ధారించారు. కాగా ఆ ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.