Fugitive Diamantaire Mehul Choksi: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ) కుంభకోణం కేసులో నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ అదృశ్యమయ్యారు. అంటిగ్వా దీవిలో తలదాచుకుంటున్న చోక్సీ కనిపించకుండాపోయినట్లు ఆయన న్యాయవాది విజయ్ అగర్వాల్ వెల్లడించారు. చోక్సీ అదృశ్యం నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
2018లో పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం బయటపడింది. పీఎన్‌బీ కేసులో నీరవ్‌మోదీతోపాటు మెహుల్ చోక్సీ దేశం విడిచి పారిపోయారు. అయితే, అక్కడి ప్రముఖ రెస్టారెంట్‌లో విందు కోసం చోక్సీ నిన్న సాయంత్రం వెళ్లినట్లు అక్కడి మీడియా వర్గాలు పేర్కొన్నాయి. చోక్సీ వాహనాన్ని రెస్టారెంట్ సమీపంలోని జాలీ హార్బర్‌లో గుర్తించినట్లు అంటిగ్వా పోలీసులు వెల్లడించారు. దీంతో అంటిగ్వా పోలీసులు ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 2017లో మెహుల్ చోక్సీ అంటిగ్వా, బార్బుడా పౌరసత్వం తీసుకున్నారు. పీఎన్‌బీ కుంభకోణం సూత్రధారి నీరవ్ మోదీకి మెహుల్ చోక్సీ మేనమామ అవుతారు.