ఓ ఆలయ నిర్మాణం విషయంలో రెండు రాజకీయ పార్టీల మధ్య వివాదం తలెత్తింది. దీంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. ఘటనలో మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ఎస్.ఎం పురంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ తలెత్తింది. స్థానికంగా శివాలయ నిర్మాణం పనులు ప్రారంభించే క్రమంలో రెండు పార్టీల నేతల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో వివాదం ముదిరి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. పరస్పర వాదనలు, ఘర్షణల నేపథ్యంలో తాజా మాజీ సర్పంచ్ చౌదరి అవినాష్ పోలీస్ స్టేషన్ భవనంపై నుంచి దూకేశారు. ఆ సమయంలో అక్కడ కార్లు అడ్డుగా ఉండటంతో అతడికి ప్రాణాపాయం తప్పి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు హుటాహుటినా అతడిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు అతడికి చికిత్స అందజేస్తున్నారు. అయితే, అవినాష్ చౌదరి పీఎస్ భవనం పై నుంచి దూకేస్తున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది.