Cyber Crime: అవును వీడు మామూలు ఖైదీ కాదు. జైల్లో కూచుని.. జైలు అధికారుల ల్యాప్‌టాప్‌ల నుంచి.. విదేశాలలోని బ్యాంకు ఖాతాలు కొల్లగొట్టి ఆ అధికారుల ఖాతాలకు మళ్ళించేశాడు. అలా చేసి ఊరుకుంటే.. ఇతని గురించి ఇంతగా చెప్పుకోనక్కరలేదు. తరువాత తానే స్వయంగా రాష్ట్ర సైబర్ సెల్ అధికారులకు ఫిర్యాదు చేసి మొత్తం తనకు సహకరించి సొమ్ము చేసుకున్న అధికారులను ఇరికించేశాడు. ఇప్పుడు లాక్కోలేక.. పీక్కోలేక గింజుకుంటున్నారు జైలు అధికారులు. సంచలనం సృష్టించిన ఈ ఉదంతం మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఈ టాప్ మోస్ట్ సైబర్ హ్యాకర్ దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, కాలిఫోర్నియా నుండి విదేశీ కరెన్సీని తాను ఉంటున్న జైలు డిప్యూటీ సూపరింటెండెంట్, జైలర్ల ఖాతాలకు జమ అయ్యేలా చేశాడు. తరువాత తీరిగ్గా ఈ విషయాన్ని రాష్ట్ర సైబర్ సెల్ అధికారులకు చేరవేశాడు. దీంతో అధికారుల బృందం ఇతగాడు ఉంటున్న భైరవగఢ్ జైలుకు చేరుకుంది. విచారణ ప్రారంభించి, ఖైదీని భోపాల్ జైలుకు తరలించారు. ఇప్పటి వరకు జరిగిన విచారణలో జైలు పరిపాలనతో సంబంధం ఉన్న దాదాపు అరడజను మంది అధికారుల ఖాతాల్లోకి లక్షలాది రూపాయలు చేరినట్లు సైబర్ సెల్ సిట్ కనిపెట్టింది. ఈ కేసును అన్ని కోణాల్లోనూ సిట్ దర్యాప్తు చేస్తోంది.
మహారాష్ట్రకు చెందిన సైబర్ క్రైమ్ నిపుణుడు అమర్ ఆనంద్ అగర్వాల్ సైబర్ మోసానికి సంబంధించి ఫిబ్రవరి 15, 2018 నుండి భైరవగఢ్ జైలులో ఉన్నారు. భైరవగఢ్ జైలు అసిస్టెంట్ సూపరింటెండెంట్ సురేష్ గోయల్, ఇతర అధికారులు సైబర్ క్రైమ్‌కు పాల్పడుతున్నారని రెండు నెలల క్రితం అమర్ అగర్వాల్ స్టేట్ సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేశారు. ఇందుకోసం అతనికి ల్యాప్‌టాప్, ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఇచ్చారు. డార్క్ వెబ్, బిట్‌కాయిన్‌ల ద్వారా డేటాను సేకరించి, కోట్లాది రూపాయలను బంధువులు, ఇతర అధికారుల ఖాతాలకు బదిలీ చేసి స్వదేశీ, విదేశీ ఖాతాల్లోకి చొరబడ్డారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదు రావడంతో జైలు అధికారుల్లో కలకలం రేగింది.
నవంబర్ 1వ తేదీన రాష్ట్ర సైబర్ సెల్ ఏర్పాటు చేసిన సిట్ హడావుడిగా భైరవగఢ్ జైలుకు చేరుకుని సంబంధిత అధికారులను సుమారు 7 గంటలపాటు గోప్యంగా విచారించింది. భైరవగఢ్ జైల్లో కూర్చున్న సమయంలో ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ ప్యాలెస్ హోటల్‌కు రష్యా ఏజెంట్ ద్వారా కోటి 60 లక్షలు చెల్లించారని, ఆ తర్వాత హోటల్ ఖాతా నుంచి 40 లక్షల రూపాయలను గోయల్‌తో పాటు ఇతర అధికారుల ఖాతాల్లో జమ చేసినట్లు కూడా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో రాష్ట్ర సైబర్ ఏడీజీ యోగేష్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ, ఈ విషయంపై ఫిర్యాదు అందిందని, ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుగుతోందని, అయితే ఫిర్యాదు ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉందని చెప్పారు.
ఈ కేసులో నవంబర్ 1న సిట్ బృందం ఉజ్జయినికి చేరుకుందని, దాదాపు 5 నుంచి 6 గంటలపాటు రహస్యంగా ప్రశ్నించినట్లు జైలు సూపరింటెండెంట్ ఉషా రాజే తెలిపారు. జైలులోని ఓ ఖైదీకి ల్యాప్‌టాప్‌లు, ఇతరత్రా సామాగ్రి అందించినట్లు తెలిసిందని చెప్పారు.
ఇవి కూడా చదవండి: Cinema after Corona: కరోనా తరువాత ఈ సినిమాలు కోట్లు కొల్లగొట్టి రికార్డులు సృష్టించాయి.. అవేమిటో తెలుసా?