కరోనా మహమ్మారి ధాటికి కొందరు బలవుతుంటే, మరికొందరు భయంతో తనువు చాలిస్తున్నారు. తాను అనుభవిస్తున్న బాధ కుటుంబసభ్యులను ఇబ్బంది కాకూడదని కొవిడ్ సోకిన ఓ పెద్దాయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
కరీంనగర్ జిల్లాకు చెందిన 60 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ గా వైద్య సిబ్బంది నిర్ధారించారు. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఆగస్టు 6వ తేదీన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. మలక్‌పేటలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్సపొందుతూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. కోవిడ్ పేషెంట్ తన రూమ్‌లో ఉరి వేసుకుని ఉన్నట్లు హాస్పిటల్ స్టాఫ్ గుర్తించింది. దీంతో వెంటనే ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. మానసిక ఆందోళనకు గురైన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.