కుప్పంలో సంచలనం రేకెత్తించిన చెన్నై వాసి కార్తికేయన్ హత్య కేసులో మిస్టరీ వీడింది. చెన్నైలోని శంకర్ నగర్‌కు చెందిన కార్తికేయన్‌ను హత్య చేసి ఇంట్లోనే పూడ్చి పెట్టారు దంపతులు. కుప్పం మండలం అడివి బూదూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటుకల వ్యాపారం చేసే శివకుమార్, మాధేశ్వరి దంపతుల పనేనని తేల్చారు చెన్నై పోలీసులు. గత నెల 18న చెన్నైలోని శంకర్ నగర్‌కు చెందిన కార్తికేయన్ అదృశ్యం. అనంతరం గతనెల 23న మిస్సింగ్ కేసు నమోదయ్యింది.
దీంతో.. కార్తికేయన్ మొబైల్ కాల్ డేటా ఆధారంగా టవర్ లొకేషన్‌ను గుర్తించి, శివకుమార్ మాధేశ్వరి దంపతుల ఇంటికి చేరుకున్నారు పోలీసులు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించడంతో.. నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇటుకుల వ్యాపారంలో భాగంగా తరచూ చెన్నైకి వెళ్లే సమయంలో కార్తికేయన్‌తో మాధేశ్వరికి పరిచయం ఏర్పడింది. ఇదికాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది. గత నెల 18న రాత్రి మాధేశ్వరి, కార్తికేయన్‌లు కలిసి ఉండడాన్ని రెడ్ హ్యాండెడ్‌గా చూసిన భర్త శివకుమార్.. కార్తికేయన్‌పై దాడి చేశాడు. ఈ దాడిలో కార్తికేయన్ మృతి చెందగా.. ఇంటి వద్దనే పూడ్చిపెట్టినట్టు చెప్పడంతో.. మిస్సింగ్ మిస్టరీ కేసు వీడింది.
కాగా.. హత్యకేసు దర్యాప్తు చేయాలంటూ కుప్పం పోలీసులను కోరిన చెన్నై పోలీసులు. కార్తికేయన్ మృతదేహన్ని ఎక్కడ పూడ్చి పెట్టారో గుర్తించేందుకు శుక్రవారం కుప్పం చేరుకున్న చెన్నై పోలీసులు. తమిళనాడు పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే తప్ప కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయలేని చెప్పిన చిత్తూరు జిల్లా పోలీసులు.