మృగాడు దొరికాడు.. మనిషి ముసుగులో ఉన్న పశువు పోలీసులకు చిక్కాడు. చిన్నారి వర్షిత అత్యాచారం, హత్య కేసును ఛేదించారు పోలీసులు. నిందితుడు రఫీని ఛత్తీస్‌గఢ్‌లో అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా బసినికొండకు చెందిన రఫీ.. లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నట్టు సమాచారం. అతడిని..పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. బాలికపై అత్యాచారం చేసి.. హత్య చేసిన రఫీ.. పోలీసులు గుర్తుపట్టకుండా గుండు గీయించుకోని, క్లీన్ షేవ్ చేయించుకుని పారిపోయాడు.
అభం, శుభం తెలియని..చిన్నారి జీవితాన్ని చిదిమేశాడు కామాంధుడు. దారుణాతి దారుణంగా 5 ఏళ్ల పసిపాపను అపహరించి, తీవ్రంగా హింసించి అత్యాచారం చేసి చంపేశాడు కిరాతకుడు. చిత్తూరు జిల్లా కురబలకోటలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారి, ముగ్గురు బిడ్డల్లో వర్షితే ఏకైక కుమార్తె. అప్పుడే తమ ముందు ఆడుకుంది. పెళ్లిలో తెగ హడావిడి చేసింది. కానీ అంతలోనే మాయమైంది. చిన్నారిని ఫోటోలు తీసి, ఆటపట్టించి, మాయమాటలు చెప్పి ..అర్థరాత్రి 12 గంటల సమయంలో కిడ్నాప్ చేశాడు దుండగుడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు వెతుకులాట ప్రారంభించగా..తెల్లారాక శివారు ప్రాతంలో పాప డెడ్ బాడీ లభ్యమైంది.
పట్టించిన నిందితుడి ఎర్ర బూట్లు:
సీసీ టీవీ విజువల్స్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. నిందితుడి ఫేస్ సరిగ్గా కనిపించకపోవడంతో..మొదట ఊహాచిత్రాన్ని విడుదల చేశారు. కానీ నిందితుడు గెటప్ ఛేంజ్ చేయడంతో..ఎటువంటి క్లూ లభించలేదు. కాస్త లోతుగా దర్యాప్తు చేయడంతో..నిందితుడి ధరించిన ఎర్ర బూట్లపై పోలీసుల దృష్టి పడింది. అప్పటికే చూచాయగా అనుమానితుడ్ని గుర్తించిన పోలీసులు..అతడి భార్యకు సీసీ విజువల్స్ చూయించగా..అక్కడ ఉన్న వ్యక్తి ధరించిన బూట్లు తన భర్తవే అని ఆమె తేల్చేసింది. దీంతో పలు బృందాలుగా విడిపోయిన పోలీసులు విసృతంగా గాలింపు చర్యలు చేపట్టి.. ఛత్తీస్‌గఢ్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా దుండగుడు గతంలో కూడా చిన్నారులను లైంగికంగా వేధించినట్టు పోలీసులకు సమాచారం అందింది.