Cybercrime Victims: సైబర్ మోసాల బాధితులకు ఊరట.. కోర్టు అవసరం లేకుండానే నగదు రీఫండ్..!

సైబర్ మోసాల్లో చిన్న మొత్తాలు కోల్పోయిన బాధితులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఊరట కల్పించింది. కోర్టు ఆదేశాలు లేకుండానే రూ.50 వేల లోపు నష్టాన్ని నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే విధానానికి హోంశాఖ ఆమోదం తెలిపింది. వెంటనే ఫిర్యాదు చేస్తే 90 రోజుల్లో రీఫండ్ లభించే అవకాశం ఉండటం లక్షల మందికి లాభం చేకూర్చనుంది.

Cybercrime Victims: సైబర్ మోసాల బాధితులకు ఊరట.. కోర్టు అవసరం లేకుండానే నగదు రీఫండ్..!
Cybercrime

Edited By:

Updated on: Jan 24, 2026 | 9:18 PM

సైబర్ మోసాల్లో చిన్న మొత్తాలు కోల్పోయిన బాధితులకు త్వరలోనే ఊరట లభించనుంది. కోర్టు ఆదేశాలు లేకుండానే రూ.50 వేల వరకు నష్టం వాటిల్లిన వారికి నేరుగా బ్యాంక్ ఖాతాలోనే డబ్బులు తిరిగి చెల్లించే ప్రతిపాదనకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. దీంతో ఇప్పటివరకు నెలల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితికి ముగింపు పలకనుంది. సైబర్ మోసాలపై ఫిర్యాదు చేసిన వెంటనే బ్యాంకులు లావాదేవీలను ఫ్రీజ్ చేస్తున్నప్పటికీ, కోర్టు ఉత్తర్వులు తప్పనిసరి కావడంతో రీఫండ్ ఆలస్యమవుతోంది. ఈ సమస్యను తొలగించేందుకు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ పంపిన ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త విధానం ప్రకారం సైబర్ మోసాన్ని వెంటనే నివేదించిన బాధితులకు, నష్టం రూ.50 వేల లోపు ఉంటే కోర్టును ఆశ్రయించకుండానే 90 రోజుల్లోగా ఫ్రీజ్ చేసిన మొత్తాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తారు. అయితే లావాదేవీలపై న్యాయ వివాదాలు లేకుండా ఉండాలి.

దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయి. భారీ మోసాలే వార్తల్లో నిలుస్తున్నప్పటికీ, ఎక్కువ మంది బాధితులు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు మాత్రమే నష్టపోతున్నారని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది రాష్ట్రంలో 88,413 సైబర్ నేర ఫిర్యాదులు నమోదవగా, మొత్తం నష్టం రూ.1,378 కోట్లుగా అంచనా వేశారు. ఇందులో రూ.246 కోట్ల లావాదేవీలను సకాలంలో ఫ్రీజ్ చేసినప్పటికీ, చట్టపరమైన ఆలస్యాల కారణంగా రూ.150.65 కోట్లు మాత్రమే 24,498 మందికి తిరిగి చెల్లించగలిగారు. ఇంకా సుమారు రూ.87 కోట్లు బ్యాంక్ ఖాతాల్లోనే నిలిచిపోయాయి. సైబర్ మోసానికి గురైన వెంటనే జాతీయ హెల్ప్‌లైన్ 1930కు ఫోన్ చేసి, బ్యాంక్ వివరాలు అందించాలని అధికారులు సూచిస్తున్నారు. అలా చేస్తే డబ్బు ట్రాక్ చేసి, విదేశాలకు లేదా క్రిప్టోకరెన్సీగా మారకముందే నిలువరించవచ్చని చెబుతున్నారు. చిన్న మొత్తాల బాధితులు ఎక్కువగా ఉండటంతో, ఈ నిర్ణయం అమలులోకి వస్తే లక్షల మందికి తక్షణ ప్రయోజనం చేకూరుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.