వారిద్దరు ప్రాణ స్నేహితులు.. కష్టం వస్తే ఒకరికొకరు సాయం చేసుకుంటారు. కానీ ఇప్పుడు బద్ద శత్రువులుగా మారిపోయారు కారణం రాజకీయం. ఇద్దరు వేర్వేరు రాజకీయ పార్టీల్లో తిరగడంతో ప్రాణ స్నేహితులు కాస్తా బద్ధ శత్రువులుగా మారిపోయారు. అయితే ఇటీవల ఒకరి ఇంట్లో ఫంక్షన్ జరగ్గా మరో వ్యక్తిని భోజనానికి పిలవలేదు. దీంతో అతడు కత్తితో దాడి చేశాడు. బొల్లాపల్లిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..
బొల్లాపల్లి మండలంలోని గరికపాడుకు చెందిన మొక్కపాటి రామారావు అదే గ్రామానికి చెందిన పసుపులేటి రత్నం చాలకాలం నుంచి స్నేహితులు. వీరు రాజకీయంగా వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. దీంతో వీరిమధ్య వైరుధ్యం ఏర్పడింది. దీంతో ఇద్దరు విడిపోయారు. అయితే ఇటీవల రామారావు తల్లి చనిపోవడంతో పెద్దకర్మ సందర్భంగా రత్నాన్ని భోజనానికి పిలవలేదు. దీంతో కక్ష పెంచుకున్నరత్నం రామారావుకి ఫోన్‌చేసి అసభ్యకరంగా మాట్లాడాడు. ఆయన బండ్లమోటు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మండిపోయిన రత్నం ఎలాగైనా రామారావుపై దాడి చేయాలని అనుకున్నాడు. సందర్భం కోసం వేచి చూసిన రత్నం, బజారులో ఒంటరిగా కూర్చున్న రామారావుపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. దీంతో పొట్ట, వీపుపై గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే రామారావును ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు రత్నంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.