పశ్చిమ గోదావరి జిల్లా నలజర్లలో చిట్టీల పేరుతో మోసానికి పాల్పడిన వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు. చీటీల పేరుతో సుమారు 5 కోట్ల రూపాయలకు టోపీ పెట్టి గ్రామం విడిచి పారిపోయిన తల్లీ కొడుకులు తిరిగి కనిపించటంతో పట్టుకున్న బాధితులు చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లకు చెందిన ఓ మహిళ గత ఎనిమిదేళ్లుగా చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజల వద్ద చీటీలపేరుతో సుమారు 5 కోట్ల రూపాయలు మేర వసూలు చేసింది. ఆపై డబ్బు ఇవ్వకుండా ఎగ్గొట్టి గ్రామం విడిచి వెళ్లిపోయింది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఆమెవద్ద చిట్టీలు వేసిన ఖాతాదారులంతా ఆందోళనకు దిగారు. నల్లజర్ల పోలీస్ స్టేషన్ లో బాధితులంతా కలిసి ఫిర్యాదు చేశారు. కొన్నిరోజుల తర్వాత తిరిగి నల్లజర్లలో కనిపించిన ఆమె కొడుకును గుర్తించిన స్థానికులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామ సచివాలయం వద్ద చెట్టుకు కట్టేసి దేహశుద్ది చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని గ్రామస్తులకు నచ్చజెప్పారు. మోసపోయిన డబ్బులు తిరిగి ఇప్పిస్తామని పోలీసులు ఇచ్చిన హామీ మేరకు స్థానికులు అతన్ని విడిచిపెట్టారు.