సాధారణంగా దొంగతనానికి వచ్చిన వారు ఎంత త్వరగా తమ పని పూర్తి చేసుకుని బయట పడదామా? అని ఆలోచిస్తుంటారు. అయితే గుంటూరు (Guntur) జిల్లాలోని చిలకలూరిపేట(Chilakaluripet) లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. దొంగతనానికి వచ్చిన ఓ దొంగ (Thief) అలసిపోయాడేమో తెలియదు కానీ అదే ఇంట్లోని బెడ్ పై బాగా గురక పెట్టి నిద్రపోయాడు. అప్పటివరకు తాళాలు వేసి ఉన్న ఇల్లు తలుపులు తెరచి ఉండడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మంచంపై ఆదమరచి నిద్రస్తోన్న ఆ దొంగను వారికి పట్టించారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని పండరీపురంకు చెందిన ఓ కుటుంబం కొద్ది రోజుల క్రితం అమెరికాకు వెళ్లింది. అయితే ఆ ఇంటికి తాళాలు వేసి ఉండటాన్ని గమనించిన విజయవాడకు చెందిన దొంగ ఇంట్లో చోరీకి ప్లాన్ వేశాడు.
అనుకున్న ప్రకారం అర్ధరాత్రి సమయంలో ఇంటి వెనుక తలుపులు తొలగించి ఇంట్లోకి ప్రవేశించాడు. అక్కడున్న సీసీటీవీ కెమెరాలను తొలగించాడు. అయితే కప్ బోర్డులు, అల్మారాలు.. ఇలా ఇళ్లంతా గాలించినా విలువైన వస్తువులేమీ అతనికి దొరకలేదు. అప్పటికే అలసిపోయాడేమో కాసేపు మంచంపై కునుకు తీద్దామనుకున్నాడు. ఏకంగా బెడ్ రూంలోని బెడ్ పై ఆదమరచి నిద్రపోయాడు. కాగా తెల్లవారుజాము ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఇంటి వచ్చిన పోలీసులకు ఇంటిలోనే ఆదమరిచి నిద్రపోతున్న దొంగ కనిపించాడు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదే చేసి దర్యాప్తు ప్రారంభించారు.
-టి. నాగరాజు, టీవీ9 తెలుగు, గుంటూరు
Also Read:Kurnool: కర్నూలు జిల్లాలో విషాదం.. ప్రేమకు అడ్డు చెప్పిన పెద్దలు.. ఎడబాటుతో ప్రేమికుల బలవన్మరణం..