Cock Fight in West Godavari District: సంక్రాంతి సంబురాలు మొదలు కానేలేదు. ఇంకా రెండు నెలల గడువు ఉంది. కానీ గోదావరి జిల్లాలో అప్పుడే కోడిపందాలు జోరుగా కొనసాగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా నాగిరెడ్డిగూడెంలో పోలీసులు దాడులు నిర్వహించారు. కోడిపందాల స్థావరాలపై దాడుల చేసి 32 మందిని అరెస్టు చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలంలోని యర్రంపల్లిలో నిర్వహించిన కోడిపందాల శిబిరాలపై పోలీసులు దాడులు చేశారు. కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. జంగారెడ్డి గూడెం డీఎస్పీ రవికిరణ్, సెబ్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. కోడిపందాలు నిర్వహిస్తున్న 32 మందిని అరెస్ట్ చేయగా, మరికొందరు పరారయ్యారు. సుమారుగా రూ. లక్ష నగదు, 40 బైకులు, 20 కార్లు, 60 కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమతులు లేకుండా కోడి పందాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.