ఆ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్లుగా నగరంలోనే నివసిస్తున్నారు. అతడు ఐపీఎస్‌కు శిక్షణ తీసుకుంటుంటే.. ఆమె తన సహకారాన్ని అందించింది. ఈ క్రమంలో ఇటీవల ఐపీఎస్‌కు కూడా సెలక్ట్ అయి.. ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే ఐపీఎస్‌కు ఎంపిక కాగానే నమ్ముకున్న అమ్మాయిని దూరంగా ఉంచాడు. ఏమైందో తెలీదు గానీ తాను మరో పెళ్లి చేసుకోవడానికి మొదటి భార్య నుంచి విడాకులు కావాలని వేధిస్తున్నాడు. ఇప్పుడు అతడి కుటుంబ సభ్యులూ ఆమెను బెదిరిస్తుండటంతో.. ఏమి చేయాలో పాలుపోని ఆ బాధితురాలు జవహర్‌నగర్ పోలీసులను ఆశ్రయించింది.
వివరాల్లోకి వెళ్తే.. కడప జిల్లాకు చెందిన కొకంటి మహేష్‌రెడ్డి, హైదరాబాద్ శివారు దమ్మాయిగూడకు చెందిన భావన ఇద్దరూ ఉస్మానియాలో ఇంజినీరింగ్ చదివారు. చదువుకునే వయస్సులో వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో రెండేళ్ల కిందట భావనకు రైల్వేలో ఉద్యోగం రాగా.. మహేష్‌రెడ్డి సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అవుతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో అతడికి భావన అండగా నిలిచింది. ఆ తరువాత 2018లో కీసరలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మహేష్‌రెడ్డి, భావనను వివాహం చేసుకున్నాడు. సికింద్రాబాద్ పద్మారావునగర్‌లో వీరు నివాసం ఉంటున్నారు. అప్పట్లోనే మహేష్‌రెడ్డి వేధింపులకు పాల్పడుతున్నాడని భావన జవహర్‌నగర్ పోలీసులను ఆశ్రయించగా.. వారు ఆ ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ఇక ఆ తరువాత ఐపీఎస్‌కు ఎన్నికైన మహేష్ గత ఆగస్టులో శిక్షణకు వెళ్లాడు. అప్పటి నుంచి భావనను దూరంగా ఉంచుతూ.. మరో అమ్మాయిని వివాహం చేసుకునేందుకు విడాకులివ్వాలంటూ బెదిరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు ఈనెల 27న మహేష్ రెడ్డిపై ఫిర్యాదు చేసింది. దీనిపై జవహర్‌నగర్ సీఐ భిక్షపతిరావు మాట్లాడుతూ.. మహేష్ రెడ్డిపై వేధింపుల కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.