World Health Organization: కరోనా మూలాలపై మరోసారి పరిశోధన.. సిద్దమవుతున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ.. చైనా వైఖరి ఇదేనా?

|

Sep 27, 2021 | 7:11 PM

గత ఏడాదిన్నర కాలానిపైగా యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ ఎక్కడ, ఎలా పుట్టిందో.. దాని మూలాలను కనుగొనేందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరోసారి పరిశోధించేందుకు రెడీ అవుతోంది. ఇదివరకు రెండుసార్లు ఈ ప్రయత్నం చేసినా..

World Health Organization: కరోనా మూలాలపై మరోసారి పరిశోధన.. సిద్దమవుతున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ.. చైనా వైఖరి ఇదేనా?
Corona Virus + Wuhan Lab + Who Logo
Follow us on

World Health Organization to study corona virus again: గత ఏడాదిన్నర కాలానిపైగా యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ ఎక్కడ, ఎలా పుట్టిందో.. దాని మూలాలను కనుగొనేందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరోసారి పరిశోధించేందుకు రెడీ అవుతోంది. ఇదివరకు రెండుసార్లు ఈ ప్రయత్నం చేసినా.. డ్రాగన్ కంట్రీ చైనా సరిగ్గా సహకరించకపోవడంతో పరిశోధనలు ఓ కొలిక్కి రాలేదు. ఈక్రమంలో మరోసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనలు మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తాజాగా తెలుస్తోంది. అక్టోబర్ మొదటివారంలోనే ఈ పరిశోధనకు సంబంధించిన చర్యలు మొదలవుతాయని సమాచారం. డబ్ల్యూహెచ్ఓ ఏర్పాటుచేసిన కొత్త పరిశోధనా బృందం ఆధ్వర్యంలో అన్వేషణ ప్రారంభం కాబోతోందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తాజాగా ఓ కథనాన్ని ప్రచురించడంతో కరోనా మూలాలపై మరోసారి పరిశోధన జరగబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. జెనెటిక్స్‌, జంతు వ్యాధులు, లేబొరేటరీ సేఫ్టీ, బయోసెక్యూరిటీ వంటి రంగాల్లో నిష్ణాతులైన సుమారు 20 మంది శాస్త్రవేత్తలు ఈ బృందంలో ఉంటారని, ఈ క్రమంలో చైనాతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ ఈ బృందం ఆధారాలు సేకరిస్తుందని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.

ఇదివరకే డబ్ల్యూహెచ్‌వో- చైనా సంయుక్త ఆధ్వర్యంలో ఈ అంశంపై పరిశోధన జరిగింది. దీనికి సంబంధించి 2021 మార్చిలో ఓ నివేదిక విడుదల చేశారు. వుహాన్‌లోని ప్రయోగశాల నుంచే వైరస్‌ ప్రమాదవశాత్తూ బయటకు వచ్చిందన్న వాదనలను నాటి రిపోర్టులో తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలో వుహాన్‌లోని ప్రయోగశాలలు, మార్కెట్లలో రెండో ఫేజ్‌ అధ్యయనాలు చేపట్టాలని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథానోమ్‌ జులైలో ప్రతిపాదించగా.. చైనా దీన్ని తోసిపుచ్చింది. అమెరికాలోని యూఎస్ ఆర్మీ మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్‌తోపాటు ఇతర దేశాల్లోనూ విచారణ చేపట్టాలని చైనా శాస్త్రవేత్తలు డబ్ల్యూహెచ్‌వోను అప్పట్లో డిమాండ్‌ చేశారు.

తాజాగా మారోసారి పరిశోధనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సిద్దమవుతున్న నేపథ్యంలో ఈ కొత్త పరిశోధనా బృందాన్ని తమ దేశంలోకి చైనా అనుమతిస్తుందా అన్నది అనుమానంగా మారింది. గతంలో జరిగిన ప్రయత్నాలకు తూతూ మంత్రంగా సహకరించిన డ్రాగన్ కంట్రీ.. ఈసారి ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందో అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేందుకు ప్రస్తుతం చైనా ప్రభుత్వం సిద్దంగా లేనట్లు తెలుస్తోంది. పరిశోధనలకు చైనా మద్దతు ఇస్తుందని చెబుతూనే మోకాలడ్డేందుకు చైనా సిద్దమవుతోంది. పరిశోధనలకు ఓకేగానీ.. ఆ ముసుగులో రాజకీయ కుట్రలను వ్యతిరేకిస్తామని అని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇటీవల యుఎన్ జనరల్‌ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తల చైనా పర్యటనపై స్పష్టత రాలేదు. మరోవైపు డబ్ల్యూహెచ్‌వో కొత్త బృందం ఎంపికను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఈ క్రమంలో కొంతమంది పేర్లనూ ప్రతిపాదించినట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.