Smoking Corona: పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అనే విషయం తెలిసిందే. అయితే పొగరాయుళ్లు మాత్రం ధూమపానం అలవాటు వదులుకోవడానికి ఇష్టపడరు. అయితే కరోనా సమయంలో స్మోకింగ్ చేసే వాళ్లు ఎట్టి పరిస్థితుల్లో ఆపేయాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. ధూమపానం ద్వారా ఆరోగస్య సమస్యలు వస్తాయని మనందరికీ తెలిసిందే. అయితే స్మోకింగ్ చేసే వారిలో మరణించే అవకాశాలు 50 శాతం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌వో) తెలిపింది.
ధూమపానం అలవాటును వెంటనే మానేయాలని సూచించిన డబ్ల్యుహెచ్‌వో.. దీనివల్ల కరోనా రిస్క్ తగ్గుతుందని, క్యాన్సర్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన ”క్విట్ టొబాకో క్యాంపెయిన్” కార్యక్రమంలో డబ్ల్యుహెచ్‌వో డైరెక్టర్ టెడ్రోస్ గెబ్రెయెసన్ పేర్కొన్నారు. ఈ విషయమై టెడ్రోస్ మాట్లాడుతూ.. తాము చేపట్టిన క్విట్ టొబాకో క్యాంపెయిన్‌కు మంచి స్పందన వచ్చిందన్నారు. ఈ క్యాంపెయిన్‌లో అన్ని దేశాలు చేతులు కలపాలని కోరారు. దీనిపై ప్రజలకు అవసరమైన సమాచారం, సపోర్ట్, టూల్స్ అందుబాటులోకి తేవాలన్నారు. ప్రస్తుతం 29 దేశాల్లో నేరుగా పనిచేస్తున్నట్లు టెడ్రోస్ వివరించారు. ఇదిలా ఉంటే పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో అవగాన కల్పించే క్రమంలో ప్రతి ఏటా.. మే 31న నో టొబాకో డే నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే.