Rajnath Singh asks Armed Forces: కరోనా అల్లాడుతున్న తరుణంలో దేశ ప్రజలకు సైన్యం అండగా ఉండాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న వేళ మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర పరిపాలనకు సహాయం అందించాలని రాజ్‌నాథ్ సింగ్ సైన్యానికి సూచించారు. సైనిక ఆసుపత్రులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో కొవిడ్ రోగులకు చికిత్స అందించాలని కోరారు. ఈ మేరకు ఆర్మీ చీఫ్ ఎంఎం నరవనేతో రక్షణ మంత్రి చర్చించారు. కరోనా బాధితులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితుల ఆధారంగా ఆర్మీకి చెందిన సీనియర్ అధికారి.. అయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదించి అవసరమైన సహకారం అందించాలని సూచినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. కరోనా నియంత్రణకు తమ వంతు సహాయం అందించేందుకు రక్షణశాఖ సిద్ధంగా ఉందని.. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు రక్షణ మంత్రిత్వశాఖ శాఖ త్రివిధ దళాలతో సంప్రదింపులు జరిపినట్లు పేర్కొన్నాయి.
Defence Minister Rajnath Singh chairs a meeting to review Ministry of Defence’s preparations and response to #COVID19 situation: Ministry of Defence pic.twitter.com/DNFrVKggg3
— ANI (@ANI) April 20, 2021
కరోనా విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడంలో తమ సంసిద్ధతను తెలుసుకోవడానికి భారత వైమానిక దళం, నేవీ నాయకత్వానికి సైతం తెలియజేసినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. విదేశాంగ, రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్ పౌర అధికారులకు సాయుధ దళాలు సహాయం అందించే ప్రాంతాలపై సమీక్షించారు. ఇప్పటికే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) దేశవ్యాప్తంగా పౌర పరిపాలనకు సహకరించాలని ఆదేశాలు ఇవ్వగా.. ఢిల్లీలోని విమానాశ్రయం సమీపంలో వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసింది. 250 పడకలతో పని చేయగా.. వాటి సంఖ్యను వెయ్యికి పెంచనున్నారు. లక్నోలో సైతం ఇదే తరహా సదుపాయాలు డీఆర్‌డీఓ కల్పించింది.