
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా మహహ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోనూ పలు కంటైన్మెంట్ జోన్లలో జులై 31 వరకూ లాక్ డౌన్ పొడిగించాయి ప్రభుత్వాలు. ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయనికొస్తే రాష్ట్ర వ్యాప్తంగా.. గత కొద్దిరోజులుగా వరుసగా రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 4074 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 53,724కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 28,800 కాగా, 24,228 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ఇక రాష్ట్రంలో మొత్తంగా కరోనా మరణాల సంఖ్య 696కి చేరింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. అనంతపురం(5483), కర్నూలు(6604), గుంటూరు(5494), తూర్పుగోదావరి(7232)లలో ఎక్కువ పాజిటివ్ కేసులు ఉండగా.. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పు గోదావరిలో 1086 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక కర్నూలు(126), కృష్ణ(108)లలో అత్యధిక కరోనా మరణాలు సంభవించాయి.
ఇక తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,198 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. హైదరాబాద్‌లో 510 మందికి కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 46,274కి చేరింది. ఇందులో 11,530 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే నిన్న 1,885 మంది కరోనా నుంచి కోలుకోవడంతో మొత్తంగా 34,323 మంది ఇప్పటివరకు వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. సోమవారం 7 మంది కరోనాతో మృతిచెందగా.. రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 422కి చేరింది. కాగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 11,003 టెస్టులు చేశారు.
Read More: