తెలంగాణలో మూడేళ్ల బాలుడికి కరోనా

|

Mar 26, 2020 | 6:58 AM

తెలంగాణ‌లో క‌రోనా వైరస్ విస్త‌రిస్తోంది. బుధ‌వారం మ‌రో రెండు కేసులు న‌మోద‌య్యాయి. సౌదీ నుంచి వచ్చిన మూడేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. హైదరాబాద్‌కు చెందిన మరో మహిళకు ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా కరోనా సోకింది..

తెలంగాణలో మూడేళ్ల బాలుడికి కరోనా
Follow us on

COVID-19: తెలంగాణ‌లో క‌రోనా వైరస్ విస్త‌రిస్తోంది. బుధ‌వారం మ‌రో రెండు కేసులు న‌మోద‌య్యాయి. సౌదీ నుంచి వచ్చిన మూడేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. హైదరాబాద్‌కు చెందిన మరో మహిళకు ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా కరోనా సోకింది. దీంతో మొత్తం వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య 41కి పెరిగింది. కాగా, చిన్నారుల‌కు కూడా క‌రోనా సోక‌డం రాష్ట్రంలో ఇదే మొద‌టిసారి.

కరోనా బాధితుల సంఖ్య మెల్లమెల్లగా పెరుగుతోంది. మూడేళ్ల బాలుడికి క‌రోనా వైర‌స్ సోకడం ఆందోళ‌న‌క‌ర అంశం. హైదరాబాద్‌ గోల్కొండలో నివసిస్తున్న ఓ కుటుంబం ఇటీవ‌లే సౌదీ అరేబియా నుంచి వ‌చ్చారు. వీరిలో మూడేళ్ల చిన్నారికి క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల రక్త‌ నమూనాలను కూడా సేకరించి పరీక్షిస్తున్నారు. బాలుడి ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉంద‌ని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్ల‌డించారు.

మరోవైపు కోకాపేటకు చెందిన 43 ఏళ్ల మహిళకు కూడా పాజిటివ్‌ నమోదైంది. ఆమె భర్త (49)కు మంగళవారం కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే ఆమె భర్త లండన్‌ నుంచి రాగా, ఆమె ఇక్కడే ఉంది. అతని ద్వారా ఆమెకు కాంటాక్ట్‌ కావడంతో స్థానికంగానే వైరస్‌ సోకడం ఆందోళన కలిగిస్తుంది. రోజురోజుకూ స్థానికంగా రెండో కాంటాక్ట్‌ ద్వారా కేసుల సంఖ్య పెరుగుతోందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. కరోనా అనుమానిత లక్షణాలతో 50 మంది ఆస్పత్రిలో చేరినట్లు అధికారులు వెల్ల‌డించారు.