Hyderabad Coronavirus: తెలంగాణలో థర్డ్ వేవ్ కరోనా కమహమ్మారి కలకలం రేపుతోంది.. రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. మూడో విడతలో ఫ్రంట్ లైన్ వారియర్స్ సైతం రాకాసి కోరలకు చిక్కుకుంటున్నారు. పోలీస్ స్టేషన్లు, ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బంది మూకుమ్మడిగా వైరస్ బారిన పడుతున్నారు.. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే తెలంగాణలోె విద్యా సంస్థలకు రాష్ట్ర సర్కార్ సెలవులు ప్రకటించింది. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు నిబంధనలను కఠినతరం చేసే దిశగా యోచిస్తోంది.
తాజాగా గాంధీ ఆస్పత్రి, ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. గాంధీ హాస్పిటల్‌లో 120 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అక్కడ సిబ్బంది, పేషెంట్లు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గాంధీ హాస్పిటల్‌లో చాలా మందికి కరోనా లక్షణాలు ఉండడంతో వారందరూ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే 40 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్లు, 38 మంది హౌస్ సర్జన్లు, 35 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు, ఆరుగురు ఫ్యాకల్టీ మెంబర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పరీక్షలు చేయించుకున్న మరికొందరు వైద్య సిబ్బంది రిపోర్ట్స్ రావాల్సి ఉంది.
ఇటు, ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో ఇన్ పేషెంట్లుగా ఉన్న 57 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అలాగే అక్కడి 9 మంది వైద్య సిబ్బంది కూడా వైరస్ బారిన పడ్డారు. దీంతో అక్కడ కరోనా లక్షణాలు ఉన్న వారికి కూడా ఆసుపత్రి అధికారులు టెస్టులు చేయిస్తున్నారు. కాగా, పలు పోలీస్ స్టేషన్లలో కూడా అధిక సంఖ్యలో సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీఎస్‌లో 16 మందికి, యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పీఎస్‌లో 12 మంది సిబ్బందికి వైరస్ సోకింది..