Coronavirus: ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాల్సిందే.. లోక్‌సభలో ఆరోగ్య శాఖ మంత్రి కీలక ప్రకటన

|

Dec 22, 2022 | 3:07 PM

వరుసగా రెండున్నరేళ్ళపాటు ప్రపంచాన్ని కుదిపేసిన కోవిడ్‌ భూతం మాటుగాసి కాటు వేస్తోంది. వరల్డ్‌ వైడ్‌గా అత్యంత వేగంగా వ్యాప్తిచెందుతోన్న బీఎఫ్‌-7 ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రకంపనలు సృష్టిస్తోంది.

Coronavirus: ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాల్సిందే.. లోక్‌సభలో ఆరోగ్య శాఖ మంత్రి కీలక ప్రకటన
Union Health Minister Mansukh Mandaviya speaks in the Lok Sabha during the Winter Session of Parliament, in New Delhi, Thursday, Dec. 22, 2022. (PTI Photo)
Follow us on

మళ్లీ డేంజర్‌ బెల్స్ మోగిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌పై లోక్‌సభలో కేంద్రమంత్రి మాండవీయ కీలక ప్రకటన చేశారు. కొత్త వేరియంట్‌ BF-7పై అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. రద్దీ ప్రాంతాల్లో ప్రతీ ఒక్కరూ మాస్క్‌ కచ్చితంగా వాడేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా కొత్త కరోనా వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్ని రాష్ట్రాలు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేయాలని.. కరోనా ముప్పు ఇంకా వెంటాడుతూనే ఉందన్నారాయన. చైనాలో కేసుల పెరుగుదల ప్రపంచానికి హెచ్చరికలాంటిదన్నారు మాండవీయ. సిట్యువేషన్ ముందు ముందు మరింత ఘోరంగా మారే అవకాశాలు ఉన్నాయన్న ఆరోగ్య నిపుణుల సూచనలను అందరూ అర్థం చేసుకోవాలన్నారు. చాలా దేశాల్లో కేసులు పెరిగిపోతున్నాయి. ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారాయన. మహమ్మారిని కంట్రోల్ చేసేందుకు ఆరోగ్య శాఖ అన్ని రకాలుగా సన్నద్దంగా ఉందన్నారు మాండవీయ.

దేశంలో హై అలెర్ట్…

కరోనా రక్కసి మరోసారి కరాళ నృత్యం చేయనుంది. యిప్పుడు భారత్‌లోనూ కొత్తరకం కోవిడ్‌ కేసులు బయటపడ్డాయి. గుజరాత్‌ బయోటెక్నాలజీ రీసెర్చ్‌ సెంటర్‌ ఈ కేసులను గుర్తించింది. ప్రస్తుతం గుజరాత్‌లో రెండు, ఒడిశాలో రెండు కొత్త కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌ బీఎఫ్‌-7 కేసులు గుర్తించారు. బీఎఫ్‌-7 ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ అత్యంత ప్రమాదకరంగా భావిస్తున్నారు. దీనిపై నిపుణుల అధ్యయనం కొనసాగుతోంది. ఇది అత్యంత వేగంగా విజృంభిస్తోంది. ఈ వేరియంట్‌ ఇన్‌క్యుబేషన్‌ పీరియడ్‌ కూడా చాలా తక్కువని గుర్తించారు. ఏ వ్యాక్సిన్‌ని అయినా తట్టుకొని నిలబడగలదని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. బీజింగ్‌లో సగంమందికిపైగా కోవిడ్‌ సోకింది. ఒక్కచైనాయే కాదు. అమెరికా, బ్రిటన్‌, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్‌, డెన్మార్క్‌లలో కోవిడ్‌ కొత్త వేరియంట్‌ బీఎఫ్‌-7.. ఒమిక్రాన్‌ హడలెత్తిస్తోంది. యిప్పుడు తాజాగా భారత్‌నీ కోవిడ్‌ వణికిస్తోంది.

చైనా ప్రకంపనలతో భారత్‌లో హై ఎలర్ట్‌ ప్రకటించారు. భారత వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. నిన్న మాన్‌సుక్‌ మాండవీయ నేతృత్వంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజలు మాస్కులు ధరించాలనీ, బూస్టర్‌ డోసు వేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఇప్పటికే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పలు హెచ్చరికలు జారీచేసింది. విమానాశ్రయాల్లో రాపిడ్‌ టెస్ట్‌లకు ఆదేశాలు జారీచేసింది. చైనా నుంచి వచ్చేవారికి కోవిడ్‌ టెస్ట్‌లను తప్పనిసరి చేసింది. చైనా నుంచి వచ్చే కనెక్టింగ్‌ ఫ్లైట్లను రద్దుచేయాలని కేంద్రం భావిస్తోంది. విదేశీ ప్రయాణికులకు తప్పనిసరి క్వారంటైన్‌పైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అలెర్ట్..

కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో ఏపీ వైద్యాశాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో కేసుల నమోదుపై వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. అనుమానిత కేసులను జీనొమ్ సీక్వెన్సీకి పంపతున్నారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ వైద్యారోగ్య శాఖ కూడా ముందస్తు చర్యలు చేపట్టింది. ఇకపై అన్ని పాజిటివ్ కేసుల శాంపిల్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపాలని నిర్ణయించుకుంది. ప్రతి రోజూ 4 వేల కరోనా టెస్టులు చేయడానికి సిద్ధమవుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.