
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పెరుగుతోంది. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు టీటీడీ అధికారులు, సిబ్బంది ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నారు. కరోనా వ్యాప్తి నివారణ కోసం టీటీడీ అమలు చేస్తున్న ముందు జాగ్రత్త చర్యలకు భక్తుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇప్పటి వరకూ టీటీడీ ఉద్యోగులు, స్థానికులకు మాత్రమే శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించిన టీటీడీ శుక్రవారం నుంచి అన్ని ప్రాంతాల భక్తులకు శ్రీవారి దర్శనం అవకాశం కల్పించనున్నట్లు వివరించారు.
టైంస్లాట్, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఉదయం 7.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. ఉదయం 6:30 గంటల నుంచి భక్తులను వైకుంఠం క్యూ లైన్ లో భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, మాస్కులు ధరించిన వారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నామని ఆయన తెలిపారు.
వెంకన్న దర్శనార్ధం వచ్చే భక్తులను అలిపిరి నడక మార్గంలో మాత్రమే అనుమతిస్తున్నామని చెప్పారు. భక్తుల భద్రతా దృష్ట్యా శ్రీవారి మెట్ల మార్గం అనుమతిని నిషేధించామని టీటీడీ చైర్మన్ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రల నుంచి వచ్చే భక్తులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరిగా తెచ్చుకోవాలని కోరారు. జూన్ 30వ తేదీ వరకు ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని ఆన్ లైన్ లో భక్తులు నవెూదు చేసుకున్నారని వెల్లడించారు. ఆన్ లైన్ ద్వారా 17వ తేదీ వరకు టైం స్లాట్ టికెట్లను టీటీడీ జారీ చేసిందని తెలిపారు.