ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారితో లక్షలాది మంది అల్లాడిపోతున్నారు. కొందరు వైరస్ ను ఎదురించలేక ప్రాణాలొదులుతున్నారు. ఇప్పటికీ మందు దొరకక్క నానా అవస్థలు పడుతున్నారు. ఒకవైపు వ్యాక్సిన్ కోసం పరిశోధనలు జరుగుతుండగా, కరోనా బారినపడుతున్న వారికి ప్లాస్మా ప్రాణవాయువుగా మారింది. ఇందులో భాగంగా ముంబైలో ప్లాస్మా థెరపీ యూనిట్‌ను ప్రారంభించింది బీఎంసీ.
దాతలు ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేసి ఇతరుల ప్రాణాలను రక్షించాలని పిలపునిచ్చారు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. కరోనా రోగులకు అందించే చికిత్సలో భాగంగా బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్లాస్మా థెరపీ యూనిట్‌ను సచిన్ టెండూల్కర్ ప్రారంభించారు. ఇందుకోసం సబర్బన్ అంధేరిలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నవారు ప్లాస్మాను సేకరించి కొవిడ్ పేషేంట్ల ప్రాణాలను నిలపాలని సచిన్ కోరారు. కరోనా కట్టడిలో ముందుండి నడిపిస్తున్న వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని..అయినప్పటికీ అవిశ్రామంగా కృషి చేస్తున్నారని సచిన్ టెండూల్కర్ కొనియాడారు. ప్లాస్మా యూనిట్‌ను ప్రారంభించిన బిఎంసిను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.