Corona Virus: కొత్త భయం.. కోవిడ్ ఉన్నా..ఆర్‌టీపీసీఆర్‌ టెస్టుల్లో నెగెటివ్! ఎందుకలా?

|

Apr 17, 2021 | 5:31 PM

కరోనా మొదటిసారి వచ్చినపుడు ఉన్న పరిస్థితులు పునరావృతం అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏడాది క్రితం కరోనా పేరు కొత్త.. దాని లక్షణాలు కొత్త.. అందుకోసం చేయాల్సిన పరీక్షలూ కొత్త.. అంతా కొత్తగా కోవిడ్ ఆడుకోవడం కోసం చేసే ప్రతి ప్రయత్నమూ ఒక ప్రయోగంలా సాగిపోయింది.

Corona Virus: కొత్త భయం.. కోవిడ్ ఉన్నా..ఆర్‌టీపీసీఆర్‌ టెస్టుల్లో నెగెటివ్! ఎందుకలా?
Corona-Tests
Follow us on

Corona Virus: కరోనా మొదటిసారి వచ్చినపుడు ఉన్న పరిస్థితులు పునరావృతం అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏడాది క్రితం కరోనా పేరు కొత్త.. దాని లక్షణాలు కొత్త.. అందుకోసం చేయాల్సిన పరీక్షలూ కొత్త.. అంతా కొత్తగా కోవిడ్ ఆడుకోవడం కోసం చేసే ప్రతి ప్రయత్నమూ ఒక ప్రయోగంలా సాగిపోయింది. యుద్ధ ప్రాతిపాదికన అన్నిటినీ తెలుసుకుని ప్రజలకు అందించారు శాస్త్రవేత్తలు. ఆ కోవలోనే ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్ కోవిడ్ నిర్ధారణ కోసం కనిపెట్టి ప్రజలకు అందించారు. ఇప్పటివరకూ అవే టెస్టులు కరోనా నిర్ధారణ కోసం చేస్తూ వస్తున్నారు. కానీ, ఇప్పుడు రెండో వేవ్ లో ఆ టెస్టుల రిపోర్టు తప్పుగా వస్తోంది. అంటే, కొత్త రూపంలో సరికొత్తగా దాడి ప్రారంభించిన కరోనాను కనిపెట్టడానికి పాత టెస్ట్ పనిచేయడం లేదని తెలుస్తోంది. దగ్గు, జ్వరం అని కరోనా భయంతో ఆసుపత్రికి వెళ్లి ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్ చేయించుకుంటే.. అది నెగెటివ్ వచ్చే అవకాశాలు కొట్టిపారేయలేం అంటున్నారు నిపుణులు. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో ఇదో ఆందోళనకర పరిణామంగా చెబుతున్నారు. ఈ టెస్టుల్లో నెగెటివ్ రాగానే సరదా పడేపని లేదు. ఇక్కడ మ్యుటేషన్‌ చెందిన వైరస్‌ మనల్ని మోసం చేసే అవకాశం లేదు. ఇది పరీక్షలకు చిక్కడం లేదు. దాదాపుగా ప్రతి ఐదుగురిలో ఒకరికి ఇలా తప్పుడు రిపోర్టు వచ్చే అవకాశాలున్నాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్నిసార్లు రెండు, మూడో టెస్టుల్లోనూ కరోనా సోకినట్లు బయటపడటం లేదని నిపుణులు చెబుతున్నారు.

ఇలా ఎలా?
గత ఏడాది ప్రారంభంలో ఉన్న సార్స్‌–కోవ్‌–2 వైరస్‌ను గుర్తించే విధంగా ఆర్‌టీపీసీఆర్‌ టెస్టును డిజైన్‌ చేశారు. తర్వాత కోవిడ్‌ వైరస్‌ అనేక రూపాంతరితాలకు లోనైంది. యూకే, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ తదితర వేరియెంట్లు ఎన్నో వచ్చాయి. ఈ రూపాంతరిత వైరస్‌ కొమ్ములు, ఇతర ప్రాంతాల్లో వచ్చిన మార్పుల కారణంగా ఆర్‌టీపీసీఆర్‌ టెస్టుల్లో అది దొరకడం లేదని చెబుతున్నారు నిపుణులు. వైరస్ లో ఉండే కొమ్ములు.. ఇతర ప్రాంతాలను గుర్తించే విధంగా కొన్ని డయాగ్నస్టిక్ టార్గెట్ లను గుర్తించడానికి వీలుగా ఆర్‌టీపీసీఆర్‌ టెస్టు చేశారు. ఇది గుర్తించగలిగేలా ఉంటుంది ఈ పరీక్ష. అయితే, ఇప్పుడు రూపాంతరం చెందిన వైరస్ ను ఈ పాయింట్స్ ద్వారా గుర్తించడం కష్టం అని చెబుతున్నారు. అంటే.. ఇప్పుడున్న వైరస్ మొదటి కరోనాకు 2.0 లేదా ఇంకా ఎక్కువ వెర్షన్ అన్నమాట. పాత వెర్షన్ సాఫ్ట్ వేర్ లని కొత్త ఓఎస్ లు ఎలా గమనించలేవో అదేవిధంగా కొత్త వెర్షన్ కరోనా వైరస్ లను ఈ ఆర్‌టీపీసీఆర్‌ టెస్టు గుర్తించలేకపోతోంది అని నిపుణులు అంటున్నారు.

వైరస్‌ జన్యుక్రమంలో పలుమార్పులతో ఇప్పుడది సాధ్యపడటం లేదు. యూకే వేరియెంట్‌ వైరస్‌లోని 69–70 ప్రాంతాల్లో ఉండే న్యూక్లియోడైడ్‌ బేసెస్‌ (జన్యు పదార్థం) పూర్తిగా తొలగిపోవడం మూలంగా పరీక్షల కచ్చితత్వంలో తేడాలు వస్తున్నాయి. వైరస్‌ సోకినా నెగెటివ్‌ రావడానికి ఇదే కారణమని పెర్కిన్‌ ఎల్మర్‌ డయాగ్నస్టిక్స్‌ జనరల్‌ మేనేజర్‌ ఆరవింద్‌ కె తెలిపారు. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) కూడా తప్పుడు ఫలితాలపై ఈ ఏడాది జనవరిలోనే డాక్టర్లను, పేషెంట్లను హెచ్చరించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫిన్లాండ్‌లో స్థానిక వేరియెంట్లో న్యూక్లియోప్రొటీన్‌లో తేడాల వల్ల దాన్ని ఆర్‌టీపీసీఆర్‌ టెస్టుల్లో గుర్తించడం కష్టమైంది.

ఫ్రెంచ్‌లోని బ్రిటానీ ప్రాంతంలో ఒక వేరియంట్‌ సోకిన ఎనిమిది మందికీ పీసీఆర్‌ టెస్టులో నెగెటివ్‌ వచ్చింది. రక్త నమూనాలు, ఊపిరితిత్తుల్లో నుంచి తీసిన టిష్యూల ఆధారంగా వారికి కరోనాను నిర్ధారించినట్లు ఫోర్బ్స్‌ తెలిపింది. అలాగే కొందరిలో వైరస్‌ నాసికా రంధ్రాల్లో, గొంతులో కేంద్రీకృతం కాకపోవడం కారణంగా కూడా అక్కడి నుంచి తీసిన నమూనాలను పరీక్షించినపుడు… పాజిటివ్‌ రావడం లేదని డాక్టర్‌ ప్రతిభా కాలే తెలిపారు. భారత్‌లో సెకండ్‌ వేవ్‌లో ఇలా పరీక్షల్లో వైరస్‌ ఏమారుస్తున్న ఉదంతాలు ఎక్కువవుతున్నాయి. కొన్ని కిట్లపై ఇవి అన్ని కేసుల్లో వైరస్‌ను కచ్చితంగా గుర్తించకపోవచ్చనే ‘గమనిక’ను కూడా ఇప్పుడు ముద్రిస్తున్నారు అంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు.

మరి పరీక్షల్లో గుర్తు తెలియకపోతే పరిస్థితి ఏమిటి?
కరోనా టెస్టుల్లో నెగెటివ్ వచ్చినా.. లక్షణాలు కనిపిస్తున్నాయి లేదా తగ్గడం లేదంటే సెల్ఫ్ ఐసోలేషన్ లో కొన్నిరోజులు ఉండడమే మంచింది. ఎందుకంటే, ఒకవేళ ఆర్‌టీపీసీఆర్‌ టెస్టు కరోనాను గుర్తించకపోయి ఉంటే, లక్షణాలు ఉండే వ్యక్తీ బయట తిరిగితే సూపర్ స్ప్రేడర్ గా మారే అవకాశం ఉంది. అతని చుట్టూ పక్కల ఉన్నవాళ్ళకి వ్యాప్తి చేసే అవకాశాలు ఉన్నాయి. పైగా ఇప్పుడు వైరస్ గాలిలో కూడా ఉంటోందని చెబుతున్నారు. ఒకవేళ మూడు నాలుగు రోజులు దాటిపోయినా లక్షణాలు కొనసాగితే కరోనా ముదిరిపోయి ప్రాణం మీదకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే, లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటే.. టెస్ట్ లో నెగెటివ్ వచ్చినా సరే.. వైద్యుల సహాయంతో మందులు వాడటమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Also Read: Double Masking: కరోనా కట్టడికి ఒక్క మాస్క్ సరిపోదా..? కాటన్ మాస్కుకు తోడు సర్జికల్ మాస్కు కలవాల్సిందేనా..?

Corona Vaccine: కరోనా టీకా రెండు డోసులూ తీసుకోవాల్సిందేనా..రెండో డోసు ఎందుకు తీసుకోవాలి? నిపుణులు ఏమంటున్నారు?