ఉత్తరప్రదేశ్‌లో జరిగినటువంటి ప్రమాదమే ఇటు తెలంగాణలోనూ చోటుచేసుకుంది. రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో ఈ తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. వలస కూలీలతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ప్రమాదంలో 49 మంది వలసకూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్‌లోని మేడ్చల్ నుంచి సుమారుగా 70 మంది వలసకూలీలు స్వస్థలాలకు బయల్దేరారు. వీరంతా లారీలో హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఘోరక్‌పూర్‌కు వెళ్తున్నారు. మార్గమధ్యలో నిర్మల్ జిల్లాలోని భాగ్యనగర్‌లో లారీ అదుపుతప్పి హైవేపై రెయిలింగ్‌ను ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక అధికారులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని నిర్మల్, హైదరాబాద్‌లోని వివిధ ఆస్ప్రతులకు తరలించారు. కాగా, ప్రమాదంపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కూడా వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పరిశీలించారు. బాధితులకు అవసరమైన సహాయక చర్యలను ఏర్పాటు చేశారు.