Paytm Vaccine Slot: కరోనా కష్టకాలంలో డిజిటల్ చెల్లింపుల దిగ్గజ సంస్థ పేటీఎం శుభవార్త ప్రకటించింది. వ్యాక్సిన్ వేసుకోవడంలో తన యూజర్లు ఇబ్బందుల పడకూడదని నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశంలో కోవిడ్-19 వాక్సిన్ లభ్యత వివరాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకోసం తన యాప్‌లో కొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. తద్వారా కరోనా వ్యాక్స్‌న్ స్లాట్స్, లభ్యత వివరాలు వినియోగదారులు సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే సంబంధిత స్లాట్స్ అందుబాటులోకి వచ్చినపుడు తన వినియోగ దారులను అలర్ట్ చేస్తుందని పేటీఎం సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
తమ యూజర్లు కరోనా వ్యాక్సిన్ స్లాట్ వివరాలను తెలుసుకునేందుకు ‘పేటీఎం వ్యాక్సిన్ స్లాట్ ఫైండర్’ అనే ఫీచర్‌ను కొత్తగా తీసుకొచ్చామని పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ గురువారం ట్వీట్ చేశారు. దీని ద్వారా వినియోగదారులు టీకా స్లాట్ బుక్ చేసుకోవడంతోపాటు తమ ప్రాంతంలో ఎక్కడ అందుబాటులో ఉన్నాయి, టీకా స్లాట్లు అందుబాటులో ఉన్నప్పుడు అలర్ట్స్ కూడా పొందవచ్చని వెల్లడించారు. దేశవ్యాప్తంగా లభించే వ్యాక్సిన్ స్లాట్‌లను కంపెనీ రియల్ టైం ట్రాక్ చేస్తోందని, సుమారు 780 జిల్లాలలో ఈ సౌకర్యాన్ని అందిస్తున్నట్టు ఆయన తెలిపారు.
We are tracking all India, ~780 districts for vaccine availability.
You can try multiple pin codes and enable notifications on @Paytm app to get your vaccination slot booked. https://t.co/At2VijuObw— Vijay Shekhar Sharma (@vijayshekhar) May 6, 2021
కాగా, దేశంలో కరోనా మహమ్మరి సెకండ్ వేవ్ ప్రకంపనలు పుట్టిస్తోంది. గత కొన్ని రోజులుగా రోజువారీ కొత్త కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. గురువారం మరోసారి కొత్త కేసుల సంఖ్య నాలుగు లక్షల మార్క్ దాటింది. దీంతో మాస్క్ ధరించడం, శానిటైజేషన్, భౌతిక దూరం లాంటి నిర్దేశిత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించడంతో పాటు అర్హులైన వారంతా కరోనా నివారణకు వ్యాక్సిన్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.