Covid Self-Testing Kit: దేశవ్యాప్తంగా రోజుకో కొత్త రూపంతో విరుచుకుపడుతున్న కరోనా మహమ్మారి పరీక్షల విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు కిట్ల గురించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కీలక ప్రకటన చేసింది. కరోనా లక్షణాలున్న వ్యక్తులు, ఆర్‌టీపీసీఆర్ పరీక్షలో పాజిటివ్‌గా తేలిన వారిని కాంటాక్ట్ అయిన వ్యక్తులకు మాత్రమే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు కిట్లను వాడాలని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. యాంటీజెన్ కిట్ల ద్వారా పాజిటివ్‌గా తేలిన వారందరినీ పాజిటివ్‌గా పరిగణించవచ్చని పేర్కొంది. అయితే, వారికి మళ్లీ పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. యాంటీజెన్ టెస్టు కిట్ ద్వారా నెగెటివ్‌గా తేలి.. లక్షణాలున్న వ్యక్తులందరూ వెంటనే ఆర్‌టీపీసీఆర్ పరీక్షను చేయించుకోవాలని సూచించింది.
కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో మరో కీలక మార్పులు తీసుకువచ్చింది కేంద్ర వైద్యారోగ్య శాఖ. ఇప్పటివరకు కేవలం ప్రభుత్వ, ప్రైవేటు కేంద్రాల్లోనే కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తుండగా.. లక్షణాలున్న వ్యక్తి ఇంటి వద్దే స్వయంగా కొవిడ్ నిర్ధారణ పరీక్ష చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకోసం ‘CoviSelf’ పేరుతో మైల్యాబ్ రూపొందించిన యాంటీజెన్ టెస్ట్ కిట్‌కు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఆమోదం తెలిపింది. దీంతో మరికొన్ని రోజుల్లోనే ఈ కిట్ విస్తృతంగా మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది.
పుణెకు చెందిన మైల్యాబ్ రూపొందించిన ఈ కిట్‌లో కోవిడ్ నిర్ధారణ పరీక్షకు కావాల్సిన ఓ ద్రవపదార్థంతో కూడిన ట్యూబ్, శాంపిల్ సేకరణకు స్వాబ్, టెస్ట్ కార్డుతో పాటు పరీక్ష పూర్తైన తర్వాత వీటిని సురక్షిత విధానంలో పడేసేందుకు ప్రత్యేక కవరు ఉంటాయి. పరీక్ష ప్రారంభించే ముందు మైల్యాబ్ రూపొందించిన కొవిసెల్ఫ్ (CoviSelf) యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని వివరాలను పూర్తిచేయాల్సి ఉంటుంది.
Pune’s Mylab receives ICMR approval for India’s first self-use Rapid Antigen Test kit ‘CoviSelf’ for COVID-19.
“This test is for self-use. If you test positive via this there’s no need for RT-PCR test as per ICMR. Any adult can use this kit by reading our manual,”says Director pic.twitter.com/3Rz59rc72O
— ANI (@ANI) May 20, 2021
కొవిసెల్ఫ్ (CoviSelf) ఎలా ఉపయోగించుకోవాలంటే….
✚ Prefilled Extraction Tube: కోవిడ్ నిర్ధారణ పరీక్షకు అవసరమయ్యే ద్రవం ఈ ట్యూబ్‌లో ఉంటుంది. దీనిని మూడు, నాలుగు సార్లు కదిలించి ద్రవాన్ని ట్యూబ్ కింద భాగంలోకి వచ్చేట్లు చూసుకోవాలి.
✚ Sterile Nasal Swab: ఈ స్వాబ్‌ను నాసికా రంధ్రాల్లో ఉంచి ఐదు సార్లు తిప్పాలి. ఇలా రెండు నాసికా రంధ్రాల్లో అలా చేయడం వల్ల కచ్చితమైన శాంపిల్ తీసుకునే అవకాశం ఉంటుంది.
✚ ఇప్పుడు ద్రవపదార్థం ఉన్న ట్యూబులో స్వాబ్‌ను ముంచి, శ్వాబ్‌పై భాగాన్ని తుంచివేయాలి. అనంతరం ట్యూబ్ మూతను కప్పివేయాలి.
✚ Test Card: ఇలా శాంపిల్‌ను ముంచిన ద్రవాన్ని టెస్ట్ కార్డుపై రెండు చుక్కలు వేయాలి. ఇక అంతే.. ఫలితం కోసం 15 నిమిషాల పాటు వేచి చూడండి.
✚ ఇప్పటికే వివరాలు నమోదు చేసుకున్న CoviSelf యాప్ నుంచి పదిహేను నిమిషాల్లోపే ఓ శబ్దం వస్తుంది.
✚ టెస్ట్ కార్డ్ (Test Card)పైన కేవలం C-క్వాలిటీ కంట్రోల్ లైన్ వద్ద మాత్రమే గుర్తు కనిపిస్తే కొవిడ్ నెగిటివ్‌గా నిర్ధారించుకోవచ్చు.
✚ ఇక క్వాలిటీ కంట్రోల్ లైన్-C తో పాటు టెస్ట్ లైన్- T వద్ద రెండు గుర్తులు కనిపించినట్లయితే కోవిడ్ పాజిటివ్‌గా పరిగణిస్తారు.
✚ కృత్రమ మేధ సహాయంతో యాప్‌లో 5 నుంచి 7 నిమిషాల్లోనే ఫలితం కనిపిస్తుంది.
✚ ఈ ఫలితం కోసం గరిష్ఠంగా 15 నిమిషాలు మాత్రమే వేచిచూడాలి.
✚ 20 నిమిషాల తర్వాత వచ్చే ఫలితాలన్ని పరిగణలోకి తీసుకోకూడదని కొవిడ్ కిట్ రూపకర్తలు వెల్లడించారు.
✚ ఇలా వచ్చిన కోవిడ్ ఫలితాన్ని CoviSelf యాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇదే కోవిడ్ నిర్ధారణ ఫలితం ఐసీఎంఆర్‌కు అనుసంధానమైన సర్వర్లోనూ నిక్షిప్తమవుతుంది.
✚ Bio Hazard Bag: ఇలా కోవిడ్ పరీక్ష పూర్తైన తర్వాత పరీక్షకు వినియోగించిన వాటన్నింటిని ప్రత్యేకమైన కవర్లో (Bio Hazard Bag) వేసి చెత్త డబ్బాలో వేయాలి.
✚ కోవిడ్ లక్షణాలు ఉండి.. ఈ యాంటీజెన్ టెస్టులో నెగటివ్ ఫలితం వస్తే మాత్రం వెంటనే RTPCR పరీక్ష చేయించుకోవాలని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది.
ఈ యాంటీజెన్ కిట్ ధర దాదాపు రూ.250 వరకు ఉండవచ్చని తెలుస్తోంది. తాజాగా ఈ కిట్‌కు ఐసీఎంఆర్ అనుమతి ఇవ్వడంతో మరికొన్ని రోజుల్లోనే మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తుందని మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ డైరెక్టర్ సుజిత్ జైన్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా అన్ని మెడికల్ షాప్‌లతోపాటు ఆన్‌లైన్‌లోనూ ఈ కిట్ అందుబాటులో ఉంటుందని మైల్యాబ్ సంస్థ పేర్కొన్నారు. ఇలా ఇంటిలో స్వయంగా కోవిడ్ నిర్ధారణ చేసుకునే కిట్‌లు అమెరికాలో విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. భారత్‌లో మాత్రం ఇదే తొలి యాంటీజెన్ కిట్ కావడం విశేషం. ఈ కిట్ అందుబాటులోకి వస్తే టెస్ట్‌లు మరింత వేగవంతం అవుతాయి. కరోనా నిర్ధారణ కోసం ప్రజల గంటల తరబడి, రోజుల తరబడి క్యూ లైన్లలో నిలబడే బాధ తప్పుతుంది
Read Also… Corona: ఒక్క ఔషధంతో కరోనా ఖతం!! కేవలం 5 రోజుల్లోనే.! పరిశోధనలో వెల్లడైన ఆసక్తికర విషయాలు..