దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి మహారాష్ట్రను వణికిస్తోంది. ముఖ్యంగా దేశ వాణిజ్య రాజధాని ముంబైలో వైరస్ ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. అయితే, గత ఐదారు నెలలుగా దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న మహారాష్ట్రకు కరోనా నుంచి కాస్తా ఊరట లభించింది. ముంబైలో కరోనా తీవ్రత గణనీయంగా తగ్గింది. ఈ విషయాన్ని స్వయంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే కుమారుడు, మంత్రి ఆదిత్య థాక్రే స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించారు.
ముంబై నగరాన్ని గత కొద్ది రోజులుగా కోవిడ్ భూతం పట్టిపీడిస్తోంది. ఇటువంటి తరుణంలో మంగళవారం ముంబై పరిధిలో 700 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదనట్లుగా మంత్రి ఆదిత్య థాక్రే వెల్లడించారు. మొత్తం 8776 కరోనా టెస్టులు చేయగా.. 700 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయినట్లు తెలిపారు. ముంబైలో ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో కరోనా టెస్టులు చేయడం ఇదే తొలిసారి అని, ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడం శుభవార్త అని ఆదిత్య థాక్రే ట్వీట్ చేశారు. అయినప్పటికీ ముంబై నగర ప్రజలు వైరస్ పట్ల అప్రమత్తంగానే ఉండాలని సూచించారు. మాస్క్‌లు ధరించటం, సామాజిక దూరం పాటించడం పట్ల అజాగ్రత్తగా ఉండొద్దని కోరారు.