Moderna Covid 19 Vaccine: భారతదేశంలోకి మోడెర్నా వ్యాక్సిన్.. దిగుమ‌తి అనుమతులు కోరుతూ సిప్లా ద‌ర‌ఖాస్తు!

|

Jun 29, 2021 | 2:32 PM

అమెరికా అభివృద్ధి చేసిన మోడెర్నా వ్యాక్సిన్‌ దిగుమ‌తి కోసం మ‌ల్టీ నేష‌న‌ల్‌ ఫార్మాసూటిక‌ల్ కంపెనీ సిప్లా ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించింది.

Moderna Covid 19 Vaccine: భారతదేశంలోకి మోడెర్నా వ్యాక్సిన్.. దిగుమ‌తి అనుమతులు కోరుతూ సిప్లా ద‌ర‌ఖాస్తు!
Follow us on

Moderna Covid 19 Vaccine in India: అతి త్వరలో దేశంలోకి మరో విదేశీ కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. అమెరికా అభివృద్ధి చేసిన మోడెర్నా వ్యాక్సిన్‌ దిగుమ‌తి కోసం మ‌ల్టీ నేష‌న‌ల్‌ ఫార్మాసూటిక‌ల్ కంపెనీ సిప్లా ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించింది. మోడెర్నా డోసుల దిగుమతి, మార్కెటింగ్‌ అనుమతుల కోసం డ్రగ్స్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)ను అనుమ‌తి కోరిన‌ట్లు స‌మాచారం. సోమ‌వార‌మే ఈ సంస్థ ద‌ర‌ఖాస్తు చేసుకున్నట్లు కంపెనీ వ‌ర్గాలు వెల్లడించాయి. ఇవాళ డీసీజీఐ వారికి అనుమ‌తి ఇచ్చే అవ‌కాశం ఉన్నట్లు కూడా వార్తలు వెలువడుతున్నాయి. మోడెర్నా అనేది ఒక మెసెంజ‌ర్ ఆర్ఎన్ఏ వ్యాక్సిన్‌. ఇది 90 శాతం స‌మ‌ర్థవంతంగా ప‌ని చేస్తున్నట్లు తేలింది. ఈనేపథ్యంలోనే భారత్‌లో అత్యవసర వినియోగ అనుమతులపై నేడు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి.

మోడెర్నా టీకాను అగ్రరాజ్యం అమెరికాతో పాటు పలు సంపన్న దేశాలు అత్యవసర అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో పాటు ఫైజర్‌ టీకా కూడా అమెరికా, బ్రిటన్‌ దేశాల్లో అందుబాటులో ఉంది. భారత్‌లోనూ ఈ టీకాలను అందుబాటులోకి తెచ్చేలా ఇటీవల డీసీజీఐ అనుమతి ప్రక్రియల్లో కొన్ని మార్పులు చేసింది. విదేశాల్లో అనుమతులు పొందిన టీకాలు దేశంలో క్లినికల్‌ ప్రయోగాలు నిర్వహించాల్సిన అవసరం లేదని పేర్కొంది. అమెరికాలో ఫైజ‌ర్‌, మోడెర్నా క‌లిపి ఇప్పటి వ‌ర‌కూ 12 కోట్ల మంది రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే, ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లకు అధిక ధ‌ర‌, ఉత్పత్తి ప‌రిమితులు, స్టోరేజీ, షిప్పింగ్ స‌మ‌స్యలు వంటివి ఉండ‌టం ఇండియాలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల‌కు అడ్డంకిగా మారింది. అయితే విదేశీ కంపెనీలు డిమాండ్‌ చేస్తున్న ఇండెమ్నిటీ రక్షణపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో వీటి రాక ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది.

Read Also… Corona 3rd wave: అమెరికాలో కరోనా వ్యాప్తి లెక్కల అంచనా ప్రకారం ఇండియాలో మూడో వేవ్ ఆగస్టు రెండో వారంలో వచ్చే అవకాశం