ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సింగిల్ డోస్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన మల్టీనేషనల్ ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ భారతదేశంలో ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా భారత్‌లో మూడో విడుత క్లినికల్ ట్రయల్స్ నిర్వహణ జాన్సన్ అండ్ జాన్సన్ ఫార్మా సంస్థ దరఖాస్తు చేసినట్లు డీసీజీఐ వర్గాలు తెలిపాయి. త్వరలో టీకా వ్రయోగానికి సిద్ధమవుతోంది. ఇందుకోసం భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునైటెడ్ స్టేట్స్, యూరప్, బ్రిటన్, జపాన్‌లోని రెగ్యులేటర్ల ఆమోదం పొందిన విదేశీ టీకాలకు ఆమోదాన్ని వేగవంతం చేయాలని కేంద్రం గతవారం నిర్ణయించిన విషయం తెలిసిందే. జేఅండ్‌జే కంపెనీ సుగమ్ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా గ్లోబల్ క్లినికల్ ట్రయల్స్ విభాగంలో ఈ నెల 12న దరఖాస్తు చేసింది. కాగా, తాజా ప్రభుత్వం నిర్ణయంతో సాంకేతిక కారణాలతో మళ్లీ జాన్సన్ అండ్ జాన్సన్ సోమవారం మళ్లీ తిరిగి దరఖాస్తు చేసిందని డీసీజీఐ వర్గాలు పేర్కొన్నాయి.
ఇదిలావుంటే, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌ను 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో మూడు నెలల వరకు నిల్వ చేసుకోవచ్చని ఆ సంస్థ ఇదివరకే ప్రకటించింది. ఇది సింగిల్ డోస్ టీకా. ఈ వ్యాక్సిన్ కరోనా వైరస్‌ను ఎదుర్కొవడంలో 66 శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని ఇదివరకే తేలింది. తీవ్రమైన కేసుల్లో 85 శాతం సమర్థతను చూపిందని ఆ సంస్థ తెలిపింది. అయితే, ఇప్పటి వరకు దేశంలో మూడు వ్యాక్సిన్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇవన్నీ రెండు మోతాదుల వ్యాక్సిన్లే. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ‘కొవిషీల్డ్’, భారత్ బయోటెక్ ‘కొవాగ్జిన్’, స్పుత్నిక్-వీ వ్యాక్సిన్లకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది.
కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు అత్యవసర వినియోగం కింద ఇప్పటికే వినియోగిస్తుండగా.. త్వరలోనే స్పుత్నిక్ వీ టీకాలు సైతం అందుబాటులోకి రానున్నాయి. ఇదిలా ఉండగా.. దేశంలో భారీగా పెరుగుతున్న కొవిడ్ కేసుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ మే ఒకటి నుంచి టీకాలు వేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అలాగే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు హాస్పిటళ్లు టీకా తయారీ సంస్థల నుంచి నేరుగా సేకరించేందుకు అనుమతులు సైతం జారీ చేసింది.
ఇదిలావుంటే, కరోనా వైరస్‌ను ఎదుర్కోనేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోసు వ్యాక్సిన్ ప్రయోగాలను ప్రపంచ వ్యాప్తంగా 44వేల మందిపై జరిపారు. అమెరికాలో జరిపిన ప్రయోగాల్లో వ్యాక్సిన్ 72శాతం, లాటిన్ అమెరికా దేశాల్లో 66శాతం, దక్షిణాఫ్రికాలో జరిపిన ప్రయోగాల్లో 57శాతం సమర్థత కనబరిచిందని జే&జే ప్రకటించింది. అంతేకాకుండా కొవిడ్ మరణాల నుంచి వందశాతం రక్షణ కల్పిస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమెరికాతో పాటు యూరప్ దేశాల్లో విరివిగా వినియోగిస్తున్నారు. భారత్‌లో విదేశీ టీకా అనుమతి పొందాలంటే మాత్రం ఇక్కడ తప్పనిసరిగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే స్పుత్నిక్ ఇప్పటికే ప్రయోగాలు పూర్తిచేయగా తాజాగా జే&జే కూడా సిద్ధమవుతోంది.