
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి కేంద్రంగా మారింది ఢిల్లీలోని మర్కజ్ నిజాముద్దీన్ ప్రార్థనలు. రెండు వారాల క్రితం అక్కడ జరిగిన మత ప్రార్థనల వల్ల కరోనా వైరస్ వ్యాప్తి వేగం పుంజుకున్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే, అక్కడికి తెలంగాణ నుంచి వెళ్లిన వారిలో చాలా మంది తమ వివరాలు వెల్లడించేందుకు ముందుకు రావడం లేదు. వీరిలో ప్రభుత్వ అధికారులు కూడా ఉండడం విస్మయం కలిగిస్తోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు ఎటువంటి సమాచారం లేకుండా వెళ్ళి రావడమే కాకుండా వచ్చిన తర్వాత నిర్లక్ష్యంగా ఓ ప్రభుత్వ అధికారి విధులకు హాజరయ్యాడు.
జనగామ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ లో అడ్మిన్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఖాజా మొహినోద్దీన్ అనే వ్యక్తి ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు ఎటువంటి సమాచారం లేకుండా వెళ్లినట్లుగా తెలిసింది. వెళ్ళి రావడమే కాకుండా వచ్చిన తర్వాత నిర్లక్ష్యంగా విధులకు హాజరై కరోనా వ్యాప్తికి కారణమయ్యాడని అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఖాజా మొహినొద్దీన్ పై కేసు నమోదు చేసినట్లు సీఐ మల్లేష్ తెలిపారు. డీఆర్డీవో రాంరెడ్డి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద నమోదు చేసినట్లుగా వెల్లడించారు.
ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న విషయం గమనించి కూడా సదరు అధికారి యధావిధిగా విధులకు హాజరైనట్లు స్పష్టం చేశారు. ఈ నెల 21, 23, 27 తేదీల్లో విధుల కు హాజరై అధికారులు, సిబ్బందితో సన్నిహితంగా మెదిలి తన నిర్లక్ష్యాన్ని నిరూపించుకున్నట్లు తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యం తో పాటు సమాచారం లేకుండా ఢిల్లీకి వెళ్లి మత ప్రార్థనల్లో పాల్గొని వైరస్ ను ఇక్కడ వ్యాప్తి చెందేందుకు ప్రయత్నించిన ఖాజా మొహిదీన్ పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సిఐ తెలిపారు.