Myocarditis Cases With Pfizer vaccine in Israel: మానవాళి తీవ్ర సంక్షోభంలో ఉన్న సమయంలో ఫైజర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ప్రజల ప్రాణాల కంటే వ్యాపారానికే అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న అపవాదును అమెరికాకు చెందిన ఔషధ సంస్థ ఫైజర్ ఇప్పటికే మూటగట్టుకుంది. తాజాగా కోవిడ్-19 కోసం ఫ్ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో గుండె మండటాన్ని గుర్తించినట్లు ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ తీసుకున్న యువతలో ఈ లక్షణాలు కనిపించినట్లు తెలిపింది. ఈ వ్యాక్సిన్‌కు, ఈ లక్షణాలకు సంబంధం ఉండవచ్చునని పేర్కొంది. టీకా పనితీరుకు సంబంధించి నిర్వహించిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడైనట్లు తెలిపింది.
ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, 2020 డిసెంబరు నుంచి 2021 మే వరకు సుమారు 5 మిలియన్ల మంది ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వీరిలో 275 మందికి మయొకార్డిటిస్ (గుండె మంట) వచ్చినట్లు వెల్లడైంది. ఈ లక్షణాలు ఉన్నవారిలో ఎక్కువ మంది దాదాపు నాలుగు రోజులపాటు ఆసుపత్రులలో చికిత్స పొందినట్లు తెలిపింది. ఇటువంటి కేసుల్లో 95 శాతం వరకు స్వల్ప స్థాయికి చెందినవిగా గుర్తించారు. నిపుణులతో కూడిన మూడు బృందాలు ఈ అధ్యయనాన్ని నిర్వహించినట్లు ఈ ఇజ్రాయెల్ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఫైజర్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకోవడానికి, మయొకార్డిటిస్ రావడానికి మధ్య సంబంధం ఉండవచ్చునని ఈ అధ్యయనం వెల్లడించిందని ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ లక్షణాలు 16 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్కుల్లో కనిపించినట్లు వివరించింది. మరీ ముఖ్యంగా 16 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్కుల్లో ఇది ఎక్కువగా కనిపించినట్లు తెలిపింది.
ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటనపై ఫైజర్ స్పందించింది. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో మయోకార్డిటిస్ కనిపించినట్లు తెలిసిందని, అయితే, వ్యాక్సిన్‌కు, దీనికి మధ్య సంబంధం ఉన్నట్లు స్పష్టంగా తెలియడం లేదని తెలిపింది. ఇటువంటి ప్రతికూల అంశాలపై క్షుణ్ణంగా సమీక్ష జరుపుతామని, ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని వ్యాక్సిన్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌తో నిరంతరం సమావేశమవుతున్నామని తెలిపింది.
ఇదిలావుంటే, ఫైజర్, మోడెర్నా అభివృద్ధిపరచిన వ్యాక్సిన్లతో సహా mRNA వ్యాక్సిన్లకు, మయోకార్డిటిస్‌కు మధ్య సంబంధంపై అధ్యయనం చేయాలని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) గత నెలలో ఆదేశించిన సంగతి తెలిసిందే.
Read Also…. కరోనా సోకడం మంచిదే అంటున్న శాస్త్రవేత్తలు..!షాకింగ్ విషయాలు వెల్లడి :Corona Second Wave