India reports record corona cases : భయపడినంతా జరుగుతోంది. దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. భారతదేశంలో నమోదవుతోన్న కరోనా కేసులు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. తాజాగా ఒక్కరోజులోనే ఏకంగా ఒక లక్షా 99 వేల 376 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదవడం దేశంలోనే సరికొత్త రికార్డు. ఇక, ఈ మహమ్మారి కాటుకు దేశ వ్యాప్తంగా ఒక్కరోజులోనే 1,027 మంది మృతి చెందారు అటు, ప్రపంచ వ్యాప్తంగానూ ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. రాకెట్ స్పీడ్‌తో విస్తరిస్తూ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది కరోనా మహమ్మారి. పరిస్థితి చూస్తే చేయి దాటిపోతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజులోనే 8 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.13 వేల 413 మంది మృతి చెందారు. ఇక మన దేశానికొస్తే కరోనా రక్కసి కేసులు దాదాపు అన్ని రాష్ట్రాల్లో అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో విలయతాండవం చేస్తోంది కరోనా మహమ్మారి. ఒక్కరోజులోనే 17 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనా ప్రారంభం నుంచి ఇవే అత్యధిక కేసులు.
ఇక మహారాష్ట్రలో ఐతే 60వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. పైగా అక్కడ ఆందోళన కలిగించే మరో అంశం. డబుల్ మ్యుటేషన్. ఈ డబుల్ మ్యుటేషన్‌తోనే వైరస్ వ్యాప్తి ఎక్కువవుతోందా అన్న అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి.
Read also : నిజామాబాద్, వరంగల్, కామారెడ్డి జిల్లాల్లో కరోనా తాండవం, ఆసుపత్రిల్లో బెడ్స్ ఫుల్, స్వీయ నిర్భంధంలో గ్రామాలు