క‌రోనా ఖేల్ః క్రికెట‌ర్ల‌తో బేర‌సారాల‌కు బుకీల ప్ర‌య‌త్నాలు – ఐసిసి

అంతర్జాతీయంగా క్రికెట్‌ స్తంభించిపోయినా అవినీతిపరులైన బుకీలు ఇప్పటికీ చురుగ్గా ఉన్నారని

క‌రోనా ఖేల్ః క్రికెట‌ర్ల‌తో బేర‌సారాల‌కు బుకీల ప్ర‌య‌త్నాలు - ఐసిసి

Updated on: Apr 20, 2020 | 2:09 PM

కోవిడ్‌-19 ధాటికి వ్యాపార‌, వాణిజ్యాల‌తో పాటు విద్యా, క్రీడా రంగాలు కూడా మూత‌ప‌డ్డాయి. ఈ క్ర‌మంలోనే జాతీయ, అంతర్జాతీయ క్రికెట్‌టోర్నీలన్నీ నిలిచిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్లందరూ వారి ఇళ్లకే పరిమితమయ్యారు. సోషల్‌మీడియా ద్వారా అభిమానులకు చేరువగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు బుకీలు మ్యాచ్‌ ఫిక్సింగ్‌కోసం క్రికెటర్లను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నారని ఐసీసీ సంచ‌ల‌నాత్మ‌క ప్ర‌క‌ట‌న‌ చేసింది.

ఈ విషయాన్ని ఐసీసీ అవినీతి నిరోధకశాఖ యూనిట్‌ హెడ్‌ అలెక్స్‌ మార్షల్‌ ధ్రువీకరించారు. గతంలో కంటే ఎక్కువసేపు సామాజిక మాధ్యమాల్లో చురుకు గా ఉంటున్న క్రికెటర్లను బుకీలు టార్గెట్‌ చేసుకు న్నారు. మార్చి 15న పాకిస్థాన్‌ సూపర్‌లీగ్‌ టోర్నీ తరువాత క్రికెట్‌ టోర్నీలన్నీ నిలిచిపోయాయి. అంతర్జాతీయంగా క్రికెట్‌ స్తంభించిపోయినా అవినీతిపరులైన బుకీలు ఇప్పటికీ చురుగ్గా ఉన్నారని ఆయన తెలిపారు. క్రికెటర్ల తో అభిమానులపేరిట మాట్లాడేందుకు యత్నిస్తూ వారితో బేరసారాలు జరిపి సంబంధాన్ని పెంచుకునేందుకు పావులు కదుపుతున్నార‌ని చెప్పారు. మ్యాచ్‌లు లేకపోవడం వల్ల ఆదాయం తగ్గడంతో తక్కువ పారితోషకం తీసుకునే ఆటగాళ్లు ఫిక్సర్లు బుకీల ఆఫర్లకు ఆకర్షితులయ్యే అవకాశం ఉందని ఏసీయూ చీఫ్‌ అన్నారు. భవిష్యత్తులో మ్యాచ్‌లు జరిగే సమయంలో వారిని వినియోగించుకుని మ్యాచ్‌ఫిక్సింగ్‌కు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ది గార్డియన్‌గా పేర్కొన్న‌ మార్షల్ చెప్పుకొచ్చారు.
అయితే క్రికెట్‌ కెరీర్‌కు ప్రమాదకరమైన బుకీల‌ గురించి ఆటగాళ్లకు అవగాహన ఉందని అలెక్స్‌ మార్షల్‌ తెలిపారు. బుకీల సంప్రదింపుల విషయంపై బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ చీఫ్‌ అజిత్‌సింగ్‌ స్పందించారు. భారత క్రికెటర్లను ఎవరైనా బుకీలు సంప్రతిస్తే సత్వరంతమకు తెలియజేయాలని క్రికెటర్లకు సూచించారు. బుకీల ప్రలోభాలాకు లొంగకూడదని తెలిపారు. మరోవైపు ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు హెడ్‌ జేమ్స్‌ పైమోంట్‌ మాట్లాడుతూ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకునేందుకు కొంతమంది బుకీలు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారని తెలిపారు. తమ ఆటగాళ్లపై నమ్మకం ఉందని, క్రికెట్‌ దృఢమైన వ్యవస్థ అని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.