FINANCIAL PACKAGE BY UNION GOVERNMENT: కరోనా (CORONA) కారణంగా వరుసగా రెండో ఆర్థిక సంవత్సరం కూడా కుదేలైపోతోంది. గత సంవత్సరం మార్చిలో మొదలైన కరోనా మోత.. రెండో ఏడు కూడా కొనసాగుతుండడంతో దేశ ఆర్థిక వ్యవస్థపై పెనుభారం పడబోతున్నది. మొదటి విడత కరోనా (FIRST WAVE CORONA) వ్యాప్తిలో దాదాపు 6 నెలల కాలం కరోనా కాటుకు గురైంది. గత సంవత్సరం మొదట కఠినంగా లాక్ డౌన్ విధించి.. ఆ తర్వాత క్రమంగా సడలిస్తు వచ్చారు. మార్చిలో మొదలైన లాక్ డౌన్ (LOCK DOWN) సెప్టెంబర్, అక్టోబర్ దాకా కొనసాగింది. ఫలితంగా దేశంలో వ్యాపార, వాణిజ్య రంగాలు చాలా దెబ్బతిన్నాయి. దేశ జీడీపీ (GDP) మైనస్‌లోకి పడిపోతుందన్న ఆందోళనను ఆర్థిక వేత్తలు వ్యక్తం చేశారు. ఇలాంటి ఆందోళనల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం (UNION GOVERNMENT) గత సంవత్సరం పలు ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటించి, అమలు చేసింది. ఈసారి కూడా అలాంటి ప్రతిపాదనలే తెరమీదికి రావడంతో కేంద్ర మరోసారి ఉద్దీపన ప్యాకేజీ రూపకల్పనపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
తాజాగా దేశంలో కరోనా మహ్మమారి సెకెండ్ వేవ్ (CORONA SECOND WAVE) ప్రభావం చూపుతోంది. 2021 మార్చి నెలలో మొదలైన కరోనా సెకెండ్ వేవ్ ప్రభావం.. ఇంకా కొనసాగుతోంది. తొలి విడత కంటే రెండో దశలో కరోనా శరవేగంగా విస్తరించింది. దాంతో ప్రభుత్వాలను లాక్ డౌన్ విధించక తప్పలేదు. మహారాష్ట్ర (MAHARASHTRA), ఢిల్లీ (DELHI) వంటి చోట్ల మార్చి నెలాఖరు నుంచే లాక్ డౌన్లు మొదలయ్యాయి. మిగిలిన రాష్ట్రాలలో ఏప్రిల్, మే నెలల్లో లాక్ డౌన్లు ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోను ప్రస్తుతం కఠినంగా లాక్ డౌన్ అమలవుతోంది. గత సంవత్సర సంక్షోభం నుంచి కోలుకుంటున్న చాలా రంగాలు రెండో విడతతో మళ్ళీ ఖాయిలా పడ్డాయి. తాజా లాక్ డౌన్ ఆంక్షలతో వ్యాపార, వాణిజ్య రంగాలు బేజారవుతున్నాయి. మెరుగవుతుందనుకున్న దేశ జీడీపీ మరోసారి మైనస్‌లోకి పడిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి.
గత సంవత్సరం కుదేలైన ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటించింది. తాజాగా మరోసారి ఉద్దీపన ప్యాకేజీ రూపకల్పనకు కేంద్ర ఆర్థిక శాఖ (UNION FINANCE MINISTRY) కసరత్తు మొదలు పెట్టినట్లు సమాచారం. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా పలు ఉద్దీపనలను ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలతోపాటు.. సెకెండ్ వేవ్‌తో దెబ్బతిన్న విమానయానం (CIVIL AVIATION), పర్యాటకం (TOURISM), హాస్పిటాలిటీ (HOSPITALITY) రంగాలు నష్టాల నుంచి కోలుకునేలా ఆర్థిక శాఖ ఉద్దీపన ప్యాకేజీని సిద్దం చేస్తోంది.
పలువురు ఆర్థికవేత్తలు ఇప్పటికే ఉద్దీపన ప్యాకేజీపై కేంద్రానికి తమ సూచనలు అంద జేస్తున్నారు. ఆర్థిక వేత్తల సూచనలను పరిగణలోకి తీసుకుని ఉద్దీపన ప్యాకేజీని సిద్దం చేస్తున్నట్లు సమాచారం. పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇటీవల కేంద్రానికి పదిహేడు సిఫారసులతో ఓ నివేదిక అందజేసింది. కరోనా సెకెండ్ వేవ్ ప్రతీ ఇంటిపైనా ప్రభావం చూపుతోంది. ఇంతటి విపత్కర పరిస్థితిలో వ్యాపార, వాణిజ్య రంగాలను ఆదుకునేలా ఉద్దీపన ప్యాకేజీ వుండాలని ఆర్థిక వేత్తలు సూచిస్తున్నారు. కరోనా ఉధృతి కారణంగా 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్ దారుణంగా దెబ్బతినే పరిస్థితి కనిపిస్తోంది. జీడీపీ వృద్ధి రేటు గణనీయంగా పడిపోయే అవకాశం వుందని ఆర్థిక వేత్తలు, సంస్థలు అంఛనా వేస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రకటించే ఉద్దీపన ప్యాకేజీ అత్యంత కీలకం కానున్నది.
ALSO READ: కరోనా మూలాలు గబ్బిలాల్లో..! చైనా గుహలపై వాల్‌స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం