కర్నాటకలో జులై 5 నుంచి ప్రతి ఆదివారం పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధించనున్నారు. బెంగుళూరులో ఒక్కరోజే 596 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 11 మంది కరోనా రోగులు మృతి చెందారు. సీఎం ఎదియూరప్ప నిన్న అత్యవసరంగా తన మంత్రివర్గ సహచరులతో సమావేశమై రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై చర్చించారు. సోమవారం నుంచి రాత్రి కర్ఫ్యూను ఎనిమిది గంటల నుంచి తెల్లవారుజామున అయిదు గంటలవరకు విధించాలని నిర్ణయించారు. ప్రభుత్వ కార్యాలయాలు ఇక వారం రోజులే పని చేయాలని, శనివారం సెలవు పాటించాలని తీర్మానించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు 11,923 కి పెరిగాయి. 7,287 మంది రోగులు కోలుకోగా.. మృతుల సంఖ్య 191 కి పెరిగింది. నగరంలోని మ్యారేజీ హాళ్లు, హాస్టళ్లు, ఇతర సంస్థలను కోవిద్-19 కేర్ సెంటర్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే పడకలు, ఇతర అదనపు సౌకర్యాలతో రైల్వే కోచ్ లను ఇలాంటి కేంద్రాలుగా వినియోగించుకోవాలని కూడా సూచించారు.