ఢిల్లీలో కరోనా వైరస్ ప్రబలంగా ఉన్న కంటెయిన్మెంట్ జోన్లలో జనాభా సేకరణ కోసం ఈ నెల 6 కల్లా ఇంటింటి సర్వే పూర్తి చేయాలన్న ప్రతిపాదనను విరమించుకున్నారు. ఈ తరుణంలో ఇది సాధ్యమయ్యే పని కాదని ఆప్ పాలనా విభాగం, కేంద్ర ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్, జాతీయ అంటువ్యాధుల నివారణా విభాగం సంయుక్తంగా రూపొందించిన నివేదిక స్పష్టం చేసింది. నీతి ఆయోగ్ కూడా ఇందుకు ఆమోదం తెలిపింది. ఈ వైరస్ వ్యాప్తి నివారణకు యుధ్ధ ప్రాతిపదికన ఇంటింటి సర్వే చేపట్టాలని మొదట నిర్ణయించారు, ముఖ్యంగా హైరిస్క్ ప్రాంతాలు, కంటెయిన్మెంట్ జోన్లలో దీన్ని ప్రారంభించాలనుకున్నారు. కానీ ఈ విధమైన సర్వే వల్ల ప్రస్తుతం నిర్వహిస్తున్న కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియ నిలిచిపొవచ్చునని తాజాగా అభిప్రాయపడ్డారు. పైగా ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్న తరుణంలో దీన్ని వాయిదా వేయవచ్ఛునని కూడా తెలుస్తోంది. నిజానికి ఈ బృహత్తర కార్యక్రమానికి వందలాది బృందాలను ప్రభుత్వం నియమించింది.