Coronavirus: ముందు జాగ్రత్తలు పాటించకుంటే నాలుగో వేవ్‌ ముప్పు తప్పదు

| Edited By: Ram Naramaneni

Apr 17, 2022 | 7:07 PM

ప్రస్తుతానికి అయితే కరోనా వైరస్‌ అదుపులోనే ఉంది. రోజువారీ కేసులు వెయ్యికి అటు ఇటుగా నమోదవుతున్నాయి. కాకపోతే ఢిల్లీలోనే అనూహ్యంగా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Coronavirus: ముందు జాగ్రత్తలు పాటించకుంటే నాలుగో వేవ్‌ ముప్పు తప్పదు
Corona
Follow us on

India Covid 19 Cases: ప్రమాదఘంటికలు మోగుతున్నాయి. ఆ చప్పుడుకు మనం నిద్రలేవకపోతే మరోసారి ముప్పు తప్పదు. ఇంతకు ముందు మూడుసార్లు చేసిన తప్పును ఈసారి చేయకూడదు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. నాలుగో వేవ్‌కు అడ్డుకట్ట వేయడానికి ఇప్పట్నుంచే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు మనకు ఎదురైన మూడు వేవ్స్‌లో పడిన కష్ట నష్టాలు చాలు. నాలుగో వేవ్‌ అనివార్యం అంటున్నారు కానీ మన సంకల్పం గొప్పదైతే ఆ తరంగాన్ని ఆపేయవచ్చు. సెకండ్‌వేవ్‌ అంత ఇబ్బంది పెట్టదని వైద్య నిపుణులు చెబుతున్నప్పటికీ భయాందోళనలు సహజమే కదా! ఎండకాలం వచ్చిందంటే చాలు అప్పటి వరకు నిద్రావస్థలో ఉన్న కరోనా బద్ధకంగా ఒళ్లు విరుచుకుని మన మీద పడటానికి రెడీ అవుతుంటుంది.. ఈసారి జులై నుంచి దేశంలో ఫోర్త్‌ వేవ్‌ వచ్చే ప్రమాదం ఉందని అధికారులు అంటున్నారు. ఒకవేళ ఫోర్త్‌ వేవ్‌ వస్తే మాత్రం ఆ బాధ్యత ప్రజలదేనని కూడా చెబుతున్నారు. ప్రభుత్వాలు ఎలాగూ చర్యలు తీసుకుంటాయి.. అదే సమయంలో ప్రజలు కూడా బాధ్యతతో మెలగాలి.

ముందు జాగ్రత్తగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలను సిద్ధం చేసుకుంటున్నాయి. హర్యానా అయితే నాలుగో వేవ్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఢిల్లీలో కరోనా వేగంగా వ్యాప్తిచెందుతోంది. పక్కనే ఉన్న గురుగావ్‌లో కూడా కేసులు బాగా పెరుగుతున్నాయి. అందుకే హర్యానా ప్రభుత్వం అలెర్టయ్యింది. కరోనాను కంట్రోల్ చేసే బాధ్యత ఒక్క ప్రభుత్వానికి మాత్రమే కాదని, ప్రతి ఒక్కరి వ్యక్తిగత బాధ్యత అని హర్యానా ఆరోగ్య శాఖ హెచ్చరికతో కూడిన సూచన చేసింది. మొదటి వేవ్‌ కంటే రెండో వేవ్‌లోనే కరోనా ఎక్కువగా నష్టం చేసింది. రెండో వేవ్‌లోనే ఎక్కువ మంది చనిపోయారు. హాస్పిటల్స్ కిటకిటలాడినవి కూడా అప్పుడే. ఆనాటి ఘటనలను తల్చుకుంటే ఇప్పటికీ వెన్నులో వణుకు మొదలవుతుంది.. ఎన్ని కంటైన్మెంట్‌ జోన్లను ఏర్పాటు చేసినా, ఎంత కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేసినా, ఎన్ని ఆంక్షలు పెట్టినా కరోనాను ఏమీ చేయలేకపోయాయి. ఇప్పుడు కంటైన్మెంట్‌ జోన్లను ఏర్పాటు చేయడం కుదరని, ఫోర్త్‌ వేవ్‌లో అలాంటివేమీ ఉండవని హర్యానా ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది.

ప్రస్తుతానికి అయితే కరోనా వైరస్‌ అదుపులోనే ఉంది. రోజువారీ కేసులు వెయ్యికి అటు ఇటుగా నమోదవుతున్నాయి. కాకపోతే ఢిల్లీలోనే అనూహ్యంగా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మరణాలు గణనీయంగా తగ్గుతుండటమే కాసింత ఊరట కలిగించే అంశం. స్కూల్స్‌ మొదలైన తర్వాత ఢిల్లీ, నోయిడా వంటి నగరాలలో పిల్లల్లో మరోసారి కోవిడ్‌ కేసులు రావడమే భయం కలిగించే అంశం. ప్రాణాంతకం కాదంటున్నారు డాక్టర్లు. కోవిడ్‌ సోకిన వారికి గొంతు నొప్పి, ముక్కు కారడం, అలసట, దగ్గు వంటి లక్షణాలు మాత్రమే కనిపిస్తాయని చెబుతున్నారు. అయినప్పటికీ అశ్రద్ధ పనికిరాదని హెచ్చరిస్తున్నారు. అర్హులైన పిల్లలంతా వెంటనే వ్యాక్సిన్‌ తీయించుకోవాలని, మాస్క్‌ పెట్టుకోవడం, శానిటైజర్‌ వాడటం వంటి కోవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలని అంటున్నారు. ఢిల్లీలో ఇప్పటికే స్కూల్స్‌ మూతపడ్డాయి. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని ప్రధాని నరేంద్రమోదీ కూడా ఓ ప్రకటన చేశారు.
ఇదిలా ఉంటే కోవిడ్‌ వైరస్‌ సోకి అనేక మంది మరణించారు. కోవిడ్‌ మరణాల సంఖ్యను లెక్కించడానికి ప్ర

స్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉపయోగిస్తున్న పద్దతిపై భారత్ అభ్యంతరం తెలిపింది. అసలు డబ్ల్యూహెచ్‌ ఓ అనుసరించిన విధానం బాగోలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్‌లో కరోనా సోకి 40 లక్షల మంది మరణించారని డబ్ల్యూహెచ్‌ఓ అంటోంది. అంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మరణాల సంఖ్యకు ఇది ఎనిమిది రెట్లన్నమాట! భారత దేశంలోని ప్రజల మరణాలను లెక్కించే తీరును వివాదాస్పదం చేస్తోందని, ఎందరు మరణించారో బహిరంగంగా వెల్లడికాకుండా రహస్యంగా ఉంచుతోందని డబ్ల్యూహెచ్‌ఓ ఆరోపించింది. దీనిపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. తక్కువ జనాభా ఉన్న దేశాలకు ఏ విధానాన్ని అయితే అమలు చేశారో అదే విధానాన్ని జనాభా పరంగా పెద్దదైన భారత్‌కు వర్తింపచేయడాన్ని భారత్‌ తప్పుపట్టింది. ఫలితాల గురించి కాదని, దానిని అనుసరిస్తున్న విధానాన్ని మాత్రమే తాము తప్పుపడుతున్నామని భారత్‌ తెలిపింది.