Legal notice to Serum: కరోనా వ్యాక్సిన్ ‘కొవిషీల్డ్’ తయారీదారు అదర్ పునావాలాకు ఆస్ట్రాజెనెకా షాకిచ్చింది. ‘కొవిషీల్డ్’ రూపొందించిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ)కి ఆస్ట్రాజెనెకా లీగల్ నోటీసు జారీ చేసింది. వ్యాక్సిన్ల సరఫరా ఆలస్యం కావడంతో నోటీసులు ఇచ్చింది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ పునావాలా ధృవీకరించారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అంశం చట్టపరమైనందున ఏమీ వ్యాఖ్యానించలేనని, సమస్యను పరిష్కరించేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని వెల్లడించారు. భారత్‌లో వ్యాక్సిన్ సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఒప్పంద బాధ్యతలను నెరవేర్చలేకపోయినట్లు ఆయన తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో అదర్ పునావాలా ఆధ్వర్యంలోని సీరం సంస్థ వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. దీంతో వ్యాక్సిన్ డోసులను సరఫరా చేసేందుకు ఆస్ట్రాజెనెకాతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే సరియైన సమయానికి వ్యాక్సిన్ అందించడంలో విఫలమైంది. ఆ సంస్థ వివరణ కోరుతూ న్యాయపరమైన నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించిన అదర్ పునావాలా.. దేశంలో పెరుగుతున్న కేసులతో ఉత్పత్తి సామర్థ్యం ఒత్తిడికి గురవుతోందన్నారు. ఇతర దేశాలకు కొవిషీల్డ్ సరఫరాలపై విరామం ఇవ్వడం, దేశంలో ‘మొదటి క్లెయిమ్’ ఒప్పందంపై విదేశాల్లో వివరించడం కష్టమన్నారు. అక్కడ వ్యాక్సిన్ మోతాదులను ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు చెప్పారు. భారత్ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, భారతీయుల కోసం ఇవ్వగలిగిన తక్కువ ధరకు ఇస్తున్నామన్నారు.
వ్యాక్సిన్ సరఫరాలో దేశప్రజలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్న ఆయన.. నెలకు 60 నుంచి 65 మిలియన్ల మోతాదులు ఉత్పత్తి చేసే సీరం ఇనిస్టిట్యూట్ ఇప్పటి వరకు వంద మోతాదులను కేంద్రానికి సరఫరా చేసి, 60 మిలియన్లను ఎగుమతి చేసినట్లు చెప్పారు. జూన్ నాటికి ఉత్పత్తి పెంచేందుకు అవసరమైన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు సీరం ఇనిస్టిట్యూట్‌కు రూ.3వేల కోట్లు అవసరమన్నారు. సీరం రెండు మిలియన్ల మోతాదుల కొవిషీల్డ్‌ను ఉత్పత్తి చేస్తుందని చెప్పారు. దేశంలో వ్యాక్సిన్‌ను రూ.150 నుంచి రూ.160కి సరఫరా చేస్తున్నామని.. సగటు ధర రూ.1,500 అని చెప్పారు.
ప్రధాని మోదీ అభ్యర్థన మేరకు సబ్సిడీ రేట్లకు అందిస్తున్నామన్నారు. వ్యాక్సిన్లపై లాభాలు సంపాదించడం లేదని, తిరిగి పెట్టుబడి పెట్టేందుకు కీలకమన్నారు. కంపెనీ ఉత్పత్తిని వంద మిలియన్ మోతాదులకు పెంచినప్పటికీ.. దేశీయ అవసరాలు తీర్చేందుకు మరికొందరు తయారీదారులు అవసరమని పూనావాలా పేర్కొన్నారు. అస్ట్రాజెనెకా నోటీసులపై న్యాయపరంగా స్పందిస్తామని అదర్ పునావాలా తెలిపారు.