Andhra Pradesh Covid 19 Cases: తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఏపీలో రోజువారీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత కొద్ది రోజులుగా తగ్గినట్లు కనిపించిన కరోనా కేసులు.. ఇప్పుడు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా, 1500కుపైనే కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 67,911 నమూనాలను పరీక్షించగా.. 1,608 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం వెల్లడించింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 281 మందికి కరోనా నిర్ధారణ అయింది. నెల్లూరు జిల్లాలో 261, తూర్పు గోదావరి జిల్లాలో 213, కృష్ణా జిల్లాలో 161, పశ్చిమ గోదావరి జిల్లాలో 154 కేసులు గుర్తించారు.
తాజాగా నమోదైన 1,608 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,27,650కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి ఆరుగురు మృతి చెందారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 13,970కి పెరిగింది. ఇక, గడిచిన 24గంటల వ్యవధిలో రాష్ట్రంలో 1,107 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 19,98,561కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య తక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 15,119 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,72,29,781 కరోనా నమూనాలను పరీక్షించినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఇక, జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి…