
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. గత రెండు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినా.. లోకల్ కాంటాక్ట్, విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా వైరస్ వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 9,664 శాంపిల్స్‌ను పరీక్షించగా 68 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజా కేసులు కలిపితే మొత్తం సంఖ్య 2,787కు చేరాయి. మరో 10 మంది వైరస్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. ఒకరు మరణించారు.
రాష్ట్రంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో చిత్తూరు జిల్లాలో 1, నెల్లూరు జిల్లాలో 8 కేసుల్లో కోయంబేడు (తమిళనాడు) నుంచి వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 816కు చేరింది. రాష్ట్రంలో 1,913 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 58 మందికి పెరిగింది. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 650పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తర్వాత గుంటూరు జిల్లాలో 400కు పైగా కేసులు ఉన్నాయి.