క‌రోనా కోర‌ల్లో తెలుగు రాష్ట్రాలు..పెరిగిపోతున్న పాజిటివ్ కేసులు

తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా భూతం జ‌డ‌లు విప్పుకుంటోంది. రోజురోజుకూ వైర‌స్ మ‌హ‌మ్మారి దావాన‌లంలా వ్యాప్తిస్తూ మృత్యుఘంటిక‌లు మోగిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు..

క‌రోనా కోర‌ల్లో తెలుగు రాష్ట్రాలు..పెరిగిపోతున్న పాజిటివ్ కేసులు

Updated on: Apr 07, 2020 | 12:18 PM

తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా భూతం జ‌డ‌లు విప్పుకుంటోంది. రోజురోజుకూ వైర‌స్ మ‌హ‌మ్మారి దావాన‌లంలా వ్యాప్తిస్తూ మృత్యుఘంటిక‌లు మోగిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ‌లో కోవిడ్ కేసుల సంఖ్య 364కు పెరిగింది. అటు ఏపీలోనూ క‌రోనా వైర‌స్ కేసుల సంఖ్య 303కు చేరింది. ఇంకా గంట‌గంట‌కు ఈ వైర‌స్ స‌మీక‌ర‌ణాలు మారుతుండ‌టం ప్ర‌జ‌ల‌కు, అధికార యంత్రాగానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.
కరోనా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఏప్రిల్ 6న మళ్లీ 30పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు  నమోదైన కరోనా కేసుల సంఖ్య 364కు చేరింది. అందులో ఎక్కువ మంది ఢిల్లీ మర్కజ్‌తో సంబంధం ఉన్నవారే కావడం ఆందోళన కలిగిస్తోంది. మిగిలినవారు వివిధ దేశాల నుంచి వచ్చిన వారు, వారి కుటుంబీకులు, స్థానికంగా ఎలాంటి కాంటాక్ట్‌తో సంబంధం లేకుండా సోకిన వారూ ఉన్నారు. నమోదైన అన్ని కేసుల్లో ఇప్పటివరకు 11 మంది చనిపోయారు. మరో 45 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
ఇప్పటివరకు అత్యధికంగా హైదరాబాద్‌ నుంచే 161 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపింది. ఆ తర్వాత నిజామాబాద్‌ జిల్లాలో 27 కేసులు నమోదు కావడం గమనార్హం. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 24 కేసులు నమోదయ్యాయి. గద్వాలలో ఏకంగా 13కు కరోనా కేసుల సంఖ్య పెరిగింది. సూర్యాపేటలో 8కి చేరుకుంది. రాష్ట్రంలో కరోనా కేసుల నివారణ, నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌  ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 303కు చేరుకుంది. ఇప్పటి వరకు నమోదైన 303 కేసులలో 23 కేసులు మినహా మిగిలిన 280 కేసులు ఢిల్లీ నిజాముద్దీన్‌కు వెళ్లి వచ్చిన వారితో సంబంధాలు ఉన్నవేనంటూ అధికారులు తేల్చారు. నిజాముద్దీన్‌ మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారు , వారిని కలుసుకున్నవారందరికీ పరీక్షలు చేయడం పూర్తయినట్టు అధికారులు తెలిపారు, ఇప్పటికే అత్యధిక పరీక్షా ఫలితాలు వెలువడ్డాయని , మరికొన్ని ఫలితాలు ఇంకా రావలసి ఉందన్నారు. దీంతో రానున్న రోజుల్లో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతుందని అనుకుంటున్నారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా నుంచి ఆరుగురు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.
కర్నూలు జిల్లాలో అత్యధికంగా 74 కేసులు నమోదుకాగా, నెల్లూరు జిల్లాలో 42 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 32, కృష్ణా జిల్లాలో 29, కడపలో 27, ప్రకాశంలో 24, పశ్చిమ గోదావరిలో 21, విశాఖపట్నంలో 20 కేసులు నమోదయ్యాయి. అటు చిత్తూరు జిల్లాలో 17, తూర్పు గోదావరి జిల్లాలో 11, అనంతపురంలో 6 కేసులు నమోదయ్యాయి. ఏపీలోని 11 జిల్లాల్లో కరోనా కేసులు వెలుగు చూసినప్పటికీ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో మాత్రం ఒక్కటీ నమోదు కాకపోవడంపై పలు విశ్లేషణలు వస్తున్నాయి.
తబ్లిగీ జమాత్‌ సదస్సుకు శ్రీకాకుళం జిల్లా నుంచి ఎవరూ వెళ్లలేదు. అయితే ఈ సదస్సుకు  హాజరైన వారు తిరిగి వచ్చేటప్పుడు ప్రయాణించిన రైలు బోగీలో ఈ జిల్లాకు చెందిన 18 మంది ప్రయాణికులున్నట్లు అధికారులు గుర్తించారు. వారిలో 12 మందిని క్వారంటైన్‌కు తరలించారు. వారి నుంచి నమూనాలు సేకరించి పరీక్షించారు. ఫలితాలు నెగెటివ్‌గా వచ్చాయి.  ఇక విజయనగరం జిల్లా నుంచి ముగ్గురు మాత్రమే ఢిల్లీ సదస్సుకు వెళ్లారు. వీరి నమూనాలను పరీక్షలకు పంపించగా ఫలితాలు నెగెటివ్‌గా వచ్చాయి.  కరోనా అనుమానిత లక్షణాలున్న కొంత మంది నమూనాలను పరీక్షల కోసం కాకినాడకు పంపించారు.