ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఆరువేల మందికి పైగా బలైపోయారు. లక్షన్నరకు పైగా కరోనా సోకి ఆస్పత్రి పాలయ్యారు. తాజాగా గత నెల ఫిబ్రవరిలో మనదేశంలోకి కూడా ప్రవేశించింది. ఇప్పటికే ఇద్దరు ఈ కరోనా ప్రభావంతో మరణించగా.. వంద మందికి పైగా వైరస్ సోకి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఇక ఈ వైరస్ ప్రభావంతో స్కూళ్లు, కాలేజీల, మాల్స్ మూతపడ్డాయి. పలు పర్యాటక స్థలాలపై కూడా కరోనా ఎఫెక్ట్ చూపుతుండటంతో.. పర్యాటక ప్రదేశాలన్నీ బోసిపోయాయి. ఇక తాజాగా దీని ఎఫెక్ట్ పుణ్యక్షేత్రాలపై కూడా పడుతోంది.
ప్రస్తుతం మహారాష్ట్రలో ఈ కరోనా ఎఫెక్ట్ ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో ముంబైలోని సుప్రసిద్ధ ఆలయమైన శ్రీ సిద్ధి వినాయక ఆలయంపై పడింది. సోమవారం సాయంత్రం నుంచి ఈ ఆలయాన్ని మూసేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు.. ఈ ఆలయానికి భక్తుల ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్టు మహారాష్ట్ర సర్కార్ ప్రకటించింది. అంతేకాదు.. అజంతా, ఎల్లోరా గుహలను సైతం మూసివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇక షిర్డీ సాయిబాబా దర్శనాన్ని వాయిదా వేసుకోవాలంటూ భక్తులకు శ్రీసాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సూచనలు చేస్తోంది. ప్రభుత్వం చేస్తున్న సూచనలన్నింటిని పట్టించుకోవాలంటూ భక్తులకు విజ్ఞప్తి చేస్తోంది. ప్రస్తుతం ఆలయంలో 11 థర్మల్ స్క్రీనింగ్ పాయింట్లను ఏర్పాటు చేసి.. భక్తులను ఆలయంలోకి అనుమతిస్తున్నారు. ఇక మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాంకాళేశ్వర్ ఆలయంలోకి కూడా భక్తులను అనుమతించడం లేదు. మార్చి 31 వరకు ఈ నిషేధం వర్తిస్తుందని అధికారులు తెలిపారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం పుణ్యక్షేత్రాలపై పడుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా కరోనా ఎఫెక్ట్‌తో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే టైం స్లాట్ టోకెన్ల ద్వారా భక్తులకు స్వామి వారి దర్శనాన్ని కల్గిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆలయ పరిసరాల్లో శుద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక విదేశాల నుంచి వచ్చిన వారు 28 రోజుల తర్వాతే స్వామి వారి దర్శనానికి రావాలని భక్తులకు సూచిస్తున్నారు.